తమిళసినిమా: ౖవెవిధ్య భరితమైన కథా చిత్రాలకు కేరాఫ్‌గా మారిన నటుడు విజయ్ సేతుపతి. ఈయన తమిళం, తెలుగు, మలయాళం, హిందీ తదితర భాషల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇలా దేనికై నా రెడీ అనే విజయ్ సేతుపతి తన 50వ చిత్రం మహారాజాతో సూపర్ హిట్ కొట్టారు. అదే విధంగా ఈయన హిందీలో ప్రతినాయకుడిగా నటించిన జవాన్ చిత్రం ఘన విజయాన్ని సాధించింది. కాగా విజయ్ సేతుపతి తాజాగా కథానాయకుడిగా నటిస్తున్న చిత్రాలలో పాండిరాజ్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ఒకటి. ఇందులో నటి నిత్యామీనన్ నాయకిగా నటిస్తుండగా యోగిబాబు తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. సత్యజ్యోతి ఫిలింస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. చక్కని కుటుంబ కథా చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. కాగా దీనికి ఆకాశం వీరన్ అనే టైటిల్ ను నిర్ణయించినట్లు తాజా సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదన్నది గమనార్హం. ఇకపోతే చిత్రాన్ని ఈ ఏడాది చివరిలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. కాగా చిత్రం ఓటీటీ హక్కులు భారీ మొత్తానికి అమ్మడు పోయినట్లు కోలీవుడ్ వర్గాల టాక్. కాగా నటుడు విజయ్ సేతుపతి తెలుగులో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో కథానాయకుడిగా నటించడానికి సిద్ధం అవుతున్నట్లు న్యూస్. తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈయన ఇప్పటికే తెలుగులో పలు చిత్రాల్లో నటించినా, హీరోగా నటించే తొలి చిత్రం ఇదే అవుతుంది.