● టాస్మాక్ విచారణపై స్టే ● మధ్యంతర ఉత్తర్వుల జారీ
హైకోర్టు
సాక్షి, చైన్నె: టాస్మాక్ ప్రధాన కార్యాలయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాల వ్యవహారం హైకోర్టుకు చేరింది. ఈడీ విచారణకు స్టే విధిస్తూ న్యాయమూర్తులు గురువారం మధ్యంతర ఉత్తర్వులను జారీ చేశారు. వివరాలు.. చైన్నెలోని టాస్మాక్ ప్రధాన కార్యాలయంలో ఈ నెల 6వ తేది నుంచి 8వ తేదీ వరకు మూడు రోజులు ఈడీ సోదాలు జరిగిన విషయం తెలిసిందే. మద్యం విక్రయాలలో అక్రమాలు జరిగినట్టుగా పేర్కొంటూ ఈ సోదాలు జరిగాయి. ఈసోదాలలో రూ. 1000 కోట్ల మేరకు అక్రమాలకు సంబంధించిన ఆధారాలు ఈడీకి చిక్కినట్టు సమాచారాలు వెలువడ్డాయి. టాస్మాక్ అధికారులు తమకు కావాల్సిన వారికి బార్ లైసెన్సులు జారీ చేసినట్టు, ఇందులో పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్టుగా ఈడీ గుర్తించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఈ వ్యవహారాన్ని ప్రతిపక్షాలు అస్త్రంగా చేసుకుని అసెంబ్లీలో సైతం ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే విధంగా ముందుకెళ్తున్నాయి. ఈ పరిస్థితులలో ఈడీ తదుపరి అడుగులు వేయడానికి సిద్దమైనట్టు సంకేతాలు వెలువడ్డాయి.
కోర్టుకు టాస్మాక్..
టాస్మాక్ అధికారులను విచారించే దిశగా ఈడీ సిద్ధమవుతున్నట్టు సమాచారాలు వెలువడ్డాయి. దీంతో ప్రభుత్వం, టాస్మాక్ తరపున మూడు పిటిషన్లు హైకోర్టులో దాఖలయ్యాయి. చట్ట విరుద్ధంగా టాస్మాక్ కార్యాలయంలో సోదాలు జరపడమే కాకుండా అధికారులు, సిబ్బందిని విచారణ పేరిట వేధించేందుకు ఈడీ చేస్తున్న ప్రయత్నాలకు స్టే విధించాలని ఓ పిటిషన్‌లో కోరారు. టాస్మాక్ వ్యవహారాలు మనీ లాండరింగ్ పరిధిలోకి రాదు అని పేర్కొంటూ, రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా జరుగుతున్న ఈ విచారణకు స్టే విధించాలని మిగిలిన పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారణ గురువారం న్యాయమూర్తులు ఎంఎస్‌రమేష్, సెంథిల్‌కుమార్ బెంచ్‌లో జరిగింది. ఓ వైపు ఈడీ తరపున వాదనలు,మరో వైపు టాస్మాక్ తరపున వాదనలు, ఇంకోవైపు రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదులు జోరుగా కోర్టులో సాగాయి. విచారణ సమయంలో న్యాయమూర్తులు సైతం ఈడీకి అంక్షింతలు వేసే విధంగా స్పందించారు. సిబ్బందిని, అధికారులను రేయింబవళ్లు మూడు రోజులు కార్యాలయంలో బంధించే అధికారం ఈడీకి ఉందా? అనిప్రశ్నించారు. ఈ మూడురోజులు జరిగిన సోదాలకు సంబంధించి సమగ్ర వీడియో ఆధారాలు ఉన్నాయా? అన్న ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. నోటీసులు ఇవ్వకుండా ఎలా సోదాలు చేశారన్న ప్రశ్నకు తాము నోటీసులు ఇచ్చినట్టు ఈడీ తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తెచ్చారు. వాదన అనంతరం న్యాయమూర్తులు స్పందిస్తూ ఈడీ తదుపరి చర్యలకు స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 25వ తేదీ వరకు టాస్మాక్ వ్యవహారంలో అధికారులపై ఎలాంటి చర్యలు , విచారణ వంటి అంశాలపై దృష్టి పెట్ట కూడదని, సమగ్ర వివరణతో నివేదికను సమర్పించాలని ఈడీని న్యాయమూర్తులు ఆదేశించారు.