● రౌడీ దారుణ హత్య ప్రత్యర్థి ముఠా ఘాతుకం ● పోలీసు ఛేజింగ్‌లో కాల్పులు ● నలుగురు రౌడీలకు గాయాలు ●ఇద్దరు పోలీసులకు కూడా.. ●ఈరోడ్ సమీపంలో పట్టపగలు కలకలం
సేలం: బెయిల్‌పై బయటకు వచ్చిన రౌడీని నడిరోడ్డులో ఓముఠా నరికి చంపేసింది. ఈ ముఠాను పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులు తుపాకులకు పని పెట్టారు. తమ మీద ఆ ముఠా దాడి చేయడంతో కాల్పులు జరిపారు. తుపాకీ తూటాలకు నలుగురి రౌడీలు గాయపడ్డారు. పోలీసులు ఇద్దరు సైతం ఆస్పత్రి పాలయ్యారు. వివరాలు.. సేలం సుందర్ నగర్‌కు చెందిన జాన్ పేరు మోసిన రౌడీ. అనేక హత్య, దోపిడి , తదితర కేసులు ఇతడిపై ఉన్నాయి. ఇటీవల బెయిల్ మీద బయటకు జాన్ వచ్చాడు. బుధవారం ఉదయం కారులతో తన భార్య శరణ్యతో పాటూ పోలీసు స్టేషన్‌లో సంతకం పెట్టి తిరుప్పూర్‌కు తిరుగు ప్రయాణం అయ్యాడు. వీరిని రహస్యంగా మరోకారులో ముఠా వెంబడించింది. సేలం – ఈరోడ్ రహదారిలోని నషియనూరు వద్ద ఈ ముఠా తమ కారుతో జాన్ కారును ఢీ కొట్టింది. కారును జాన్ ఆపేలోపు ఆ ముఠా కత్తులతో దాడి చేసింది. భార్య శరణ్య కల్లెదుటే జాన్‌ను నరికి చంపేశారు. తర్వాత అక్కడి నుంచి ఆ ముఠా ఉడాయించింది. ఈ సమాచారం గస్తీలో ఉన్న పోలీసులకు చేరింది. దీంతో కారులో పరారీ అవుతున్న ముఠాను ఇన్‌స్పెక్టర్ రవి నేతృత్వంలోని పోలీసు ఛేజింగ్ చేశారు. పోలీసుల తమను వెంటాడుతుండటంతో ఓ ప్రాంతంలో కారును ఆపేసిన ఆ ముఠాలోని వారు పోలీసులపై తిరగబడ్డారు. ఆయుధాలతో పోలీసులపై దాడిచేశారు. దీంతో ఇన్‌స్పెక్టర్ రవి తన వద్ద ఉన్న తుపాకీతో కాల్పులు జరిపారు. ఈ కాల్పులలో తూటాల దాడికి నలుగురు రౌడీలు కింద పడ్డారు. వీరందరికి కాళ్ల కింది భాగంలో తూటాలు దిగాయి. సమాచారం అందుకున్న అదనపు బలగాలు అక్కడికి చేరుకున్నాయి. గాయపడ్డ ఇన్‌స్పెక్టర్ రవి, కానిస్టేబుల్ లోకనాథంతో పాటూ ఆముఠాకు చెందిన నలుగుర్ని ఆస్పత్రికి తరలించారు. మరో ముగ్గురు పరారైన సమాచారంతో వారి కోసం గాలింపు ముమ్మరం చేశారు. పట్ట పగలే నడి రోడ్డులో ఈ ఘటన జరగడంతో ఆ పరిసరాలలోఉత్కంఠ నెలకొంది. తుపాకీ తూటాలకు గాయపడ్డ వారిలో రౌడీలు సతీష్, శరవణన్, భూపాలన్, కార్తికేయన్ ఉన్నారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. ఇది ప్రతీకార హత్యగా విచారణలో తేలింది. సమాచారం అందుకున్న ఈరోడ్ ఎస్పీ జవహర్ ఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. గాయపడ్డ పోలీసులను పరామర్శించారు. అయితే తుపాకీకి పని పెట్టిన పోలీసులు సేలం జిల్లాకు చెందిన వారు కావడం గమనార్హం. వీరు ఆ ముఠాను చేజింగ్ చేస్తూ కొన్ని కిలో మీటర్లు దూసుకొచ్చినట్టు తేలింది.
రగిలిన ప్రతీకారం
రగిలిన ప్రతీకారం
రగిలిన ప్రతీకారం