తమిళసినిమా: హీరో అంటే ఎర్రగా, ఆరడుగుల బుల్లెట్‌గా ఉండాలి అనే ఆనవాయితీని మొదట బ్రేక్ చేసింది తమిళసినిమానే అని చెప్పవచ్చు. ఇక్కడ ప్రతిభనే
కొలమానం. అది ఉంటే ఎవరైనా హీరో కావచ్చు. ప్రేక్షకుల ఆదరణ పొందవచ్చు. ఇలా ఇప్పటికే చాలా మంది సినిమా రంగంలో ఇతర శాఖలకు చెందిన వారు హీరోలుగా అవతారమెత్తి రాణిస్తున్నారు. తాజాగా దర్శకుడు కేబీ.జగన్ ఈ పట్టికలో చేరారు. ఈయన ఇంతకు ముందు పుదియ గీతై,కోడంబాక్కమ్, రామన్ తేడియ సీతై వంటి హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. తాజాగా రోజా మల్లీ కనకాంబరం అనే చిత్రం ద్వారా హీరోగా పరిచపయం అవుతున్నారు. ఈ చిత్రానికి కథ, దర్శకత్వం బాధ్యతలను ఈయనే నిర్వహిస్తున్నారు. ఈ చిత్ర టైటిల్, టీజర్ కోసం షూటింగ్‌ను ఆదివారం ఉదయం తిరుచెందూర్‌లోని శాస్తా ఆలయంలో నిర్వహించారు. కాగా ఇది కుటుంబ సమేతంగా చూసి ఆనందించే కథా చిత్రంగా ఉంటుందని దర్శకుడు కేజీ.జగన్ తెలిపారు. ఇది తన జీవితంలో జరిగిన యదార్థ ఘటన ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రం అని తెలిపారు. ఇంతకు ముందు మాయాండి కుటుంబత్తార్ అనే విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన యునైటెడ్ ఆర్ట్స్ పతాకంపై ఎస్‌కే.సెల్వకుమార్ నిర్మిస్తున్నట్లు చెప్పారు. కాగా ఈ చిత్రంలో నటించే కథానాయకి, ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు దర్శకుడు పేర్కొన్నారు.