● ఎక్కడికక్కడ నేతల అరెస్టు
● ఉద్రిక్తత
సాక్షి, చైన్నె: టాస్మాక్ మద్యం అక్రమాలపై బీజేపీ నేతృత్వంలో చైన్నెలో పలుచోట్ల సోమవారం నిరసనలు హోరెత్తాయి. ఎక్కడికక్కడ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ముఖ్యనేతలను గృహ నిర్బంధంలో ఉంచారు.దీంతో ఉద్రికత్త చోటు చేసుకుంది. గత వారం టాస్మాక్ ప్రధాన కార్యాలయంలో సాగిన ఈడీ సోదాల గురించి తెలిసిందే. ఇందులో రూ. 1000 కోట్ల మేరకు అక్రమాలు వెలుగు చూసినట్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ఆరోపించారు. ఈ అక్రమాలపై విచారణకు పట్టుబడుతూ సీఎం సమాధానం ఇవ్వాలని నినాదిస్తూ పోరుబాటకు పిలుపునిచ్చారు. సోమవారం బీజేపీ నేతృత్వంలో ఎగ్మూర్‌లోని టాస్మాక్ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించేందుకు బీజేపీ నేతలు నిర్ణయించారు. ఇందుకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు.దీంతో నిషేదాజ్ఞలను ఉల్లంఘించి పోరు బాటకు బీజేపీనేతలు సిద్ధమయ్యారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న దృష్ట్యా, నిరసనలు, ఆందోళనకు అనుమతి లేదని పేర్కొంటూ పోలీసులు బీజేపీ ఆందోళనను భగ్నం చేసేందుకు సిద్ధమయ్యారు. ఎక్కడిక్కడ నేతలను అరెస్టు చేశారు. ఈ నిరసనకు తన నివాసం నుంచిబయలు దేరిన మాజీ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్‌ను మార్గ మధ్యలో అడ్డుకుని బలవంతంగా అరెస్టు చేశారు. అలాగే,బీజేపీ మహిళా మోర్చా నేత, ఎమ్మెల్యే వానతీ శ్రీనివాసన్‌ను, యువజన నేత వినోజ్ పి సెల్వం, పొన్ రాధాకృష్ణన్, హెచ్ రాజాలతోపాటుగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలైను సైతం మార్గ మధ్యలోనే ఎక్కడిక్కడ అరెస్టు చేశారు. ఈ అరెస్టులను బీజేపీ వర్గాలు అడ్డుకునేప్రయత్నం చేశారు. బీజేపీ ముఖ్య నేతలందర్నీ ఎక్కడికక్కడ అరెస్టు చేసి స్థానికంగా ఉన్నకల్యాణ మండపాలలో ఉంచారు. అన్నామలైను అక్కరైలోని ఓ రిసార్ట్‌లో ఉంచారు. ఎగ్ముర్‌రాజరత్నం స్టేడియం వద్దకు చేరుకున్న మహిళా నేతలను పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి సమీపంలోని కల్యాణ మండపంకు తరలించారు. అయితే నిరసనకారులు పోలీసులపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తంచేశారు. కల్యాణమండపాలలో కనీస సౌకర్యాలు కూడా లేవని మండిపడ్డారు. మధ్యాహ్నం తర్వాత నిరసనకారులను విడుదల చేశారు. తన అరెస్టును అన్నామలై తీవ్రంగా ఖండింంచారు. ఇప్పుడు అడ్డుకుని ఉండవచ్చు అని, మరోమారు తమను అడ్డుకోలేరన్నారు. ఈసారి తేదీ ప్రకటించకుండా నిరసనకు దిగుతామన్నారు. టాస్మాక్ అక్రమాలలో ఏ–1 సీఎం స్టాలిన్ అని, నిందితుడు ఏ– 2 మంత్రి సెంథిల్ బాలాజీ అని ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల కో– ఇన్‌చార్జ్ పొంగులేటి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ, తమ వారిని బలవంతంగా అరెస్టు చేయడాన్ని ఖండించారు. శాంతియుతంగా నిరసనకు దిగిన వారితో పోలీసులను ఉసిగొల్పి అరెస్టులు చేయించడం హేయమైన చర్యగా పేర్కొన్నారు. మద్యం కుంభకోణానికి సీఎం స్టాలిన్ నైతిక బాధ్యత వహించాలని, ఎకై ్సజ్ మంత్రిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.