అవిశ్వాసంలో | - | Sakshi
Sakshi News home page

అవిశ్వాసంలో

Mar 18 2025 12:43 AM | Updated on Mar 18 2025 12:42 AM

అసెంబ్లీలో స్పీకర్‌కు వ్యతిరేకంగా అన్నాడీఎంకే తీసుకొచ్చిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. ఓటింగ్‌లో స్పీకర్‌ అప్పావు నెగ్గారు. 154 మంది సభ్యులు ఆయనకు మద్దతుగా ఓటు వేశారు. డీఎంకే కూటమి సభ్యులు ఇచ్చిన మెజారిటీతో స్పీకర్‌ అసెంబ్లీలోని తన సీటులో మళ్లీ కూర్చున్నారు.
అంతర్గత వార్‌ కప్పి పుచ్చుకునేందుకే..

అసెంబ్లీలో ప్రసంగిస్తున్న సీఎం స్టాలిన్‌, స్పీకర్‌ చైర్‌లో డిప్యూటీ స్పీకర్‌ పిచ్చాండి

సాక్షి, చైన్నె: అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు గతవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. తొలిరోజు ఆర్థిక బడ్జెట్‌ను ఆ శాఖ మంత్రి తంగం తెన్నరసు సభలో దాఖలు చేశారు. రెండోరోజైన శనివారం వ్యవసాయ బడ్జెట్‌ను ఆ శాఖ మంత్రి ఎంఆర్‌కే పన్నీరు సెల్వం సభకు సమర్పించారు. ఆదివారం సెలవు తదుపరి సోమవారం సభ ప్రారంభమైంది. తొలుత స్పీకర్‌ అప్పావు నేతృత్వంలో ప్రశ్నోత్తరాలు సాగాయి. ఈసందర్భంగా పలువురు సభ్యుల ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇచ్చారు. మంత్రి ఏవీ వేలు సమాధానం ఇస్తూ, పోలూరు – జమునాముత్తరు మధ్య రోడ్డు విస్తరణ పనులు చేపట్టనున్నామన్నారు. ఈరోడ్‌– గోబి చెట్టి పాళయం మధ్య ఫోర్‌ వే పనులు జరుగుతున్నాయని, ఇందుకు సంబంధించిన సమగ్ర వివరాలను తన శాఖకు నిధుల కేటాయింపునకు సంబంధించిన చర్చసమయంలో ప్రకటిస్తానన్నారు. మంత్రి నెహ్రూ మాట్లాడుతూ, ఈ ఏడాది కార్పొరేషన్లు, పురపాలక సంస్థలలో రూ. 950 కోట్లతో వర్షపు నీటి కాలువతో పాటూ రోడ్లు పునరుద్దరణ పనులు చేపట్టనున్నామన్నారు. చైన్నె ఎగ్మూర్‌, షోళింగనల్లూరు డివిజన్లను విభజించే విషయంగా త్వరలో పరిశీలిస్తామని మంత్రి కేకేఎస్‌ఎస్‌ఆర్‌ రామచంద్రన్‌ తెలిపారు. ఉత్తర మేరు వద్ద పాలరు నదీ తీరంలో రూ. 70 కోట్లతో చెక్‌ డ్యాం నిర్మించనున్నామని మంత్రి దురై మురుగన్‌ ప్రకటించారు. రామనాధపురం, విరుదునగర్‌, మదురై, శివగంగై జిల్లాలోని 2,500 ఎకరాలలో తుమ్మ చెట్లను తొలగించడం, రూ.11 కోట్లతో మిరప పంటపై దృష్టి పెట్టే విధంగా కార్యాచరణ సిద్ధం చేశామని మంత్రి ఎంఆర్‌కే పన్నీరు సెల్వం వివరించారు. ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చే క్రమంలో మంత్రి శేఖర్‌ బాబు మాంత్రీకం అన్న పదాన్ని ఉపయోగించడంతో దానికి సమధానం ఇవ్వాలని మాజీ సీఎం పన్నీరు సెల్వం పట్టుబట్టారు. పరిహార మండపం అనే బదులు మాంత్రీకం అన్న పదం వాడినట్టు మంత్రి వివరణ ఇచ్చుకున్నారు. ప్రశ్నోత్తరాల అనంతరం సభలో సంతాప తీర్మానాలు ప్రవేశ పెట్టారు. ఇటీవల కాలంలో మరణించిన మాజీ ఎమ్మెల్యేలతో పాటూ పలువురు ప్రముఖులు, ప్రముఖ డాక్టర్‌ చెరియన్‌ల మృతికి సంతాపం తెలియజేశారు. అనంతరం సభలో స్పీకర్‌ అప్పావుకు వ్యతిరేకంగా అన్నాడీఎంకే ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసు చర్చకు తీసుకున్నారు. ఈ సమయంలో స్పీకర్‌ అప్పావు తన సీటు నుంచి కిందకి దిగి వెళ్లి పోయారు. సభను డిప్యూటీ స్పీకర్‌ పిచ్చాండి నడిపించారు.

పక్షపాతం చూపుతున్నారు..

అవిశ్వాస తీర్మానం చర్చలో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, ప్రధాన ప్రతిపక్ష నేత పళణి స్వామి మాట్లాడుతూ, స్పీకర్‌ పక్షపాతి, అన్నాడీఎంకే గళాన్ని నొక్కేస్తున్నారని మండిపడ్డారు. సభలో ఆయన చర్యలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని, ఎవరి ఆదేశాలకు అనుగుణంగా ఆయన సభలో నడుచుకుంటున్నారో ఏమో .. అని అసహనం వ్యక్తం చేశారు. అన్నాడీఎంకే వర్గాలను ప్రసంగించకుండా ఏదో ఒక అంశాన్ని ప్రస్తావిస్తూ, అడ్డుకోవడం, వాకౌట్‌ చేసే సమయాలలో హేళన చేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. సభా వ్యవహారాల ప్రత్యక్ష ప్రసారం గాల్లోకి వదిలి పెట్టారని, ఏడాదికి వంద రోజులు సభను నిర్వహిస్తామన్న హామీని విస్మరించారని ధ్వజమెత్తారు. నాలుగేళ్లలో 400 రోజులు సభ జరగాల్సి ఉండగా, కేవలం 114 రోజులు మాత్రమే నిర్వహించారని, స్పీకర్‌ తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని వ్యాఖ్యలు చేశారు.

వీగిన తీర్మానం..

అప్పావుకు 154 మంది సభ్యుల మద్దతు

అంతర్గత వార్‌ కప్పి పుచ్చుకునేందుకే తీర్మానం

అన్నాడీఎంకేపై సీఎం స్టాలిన్‌ ఫైర్‌

అప్పావు పక్షపాతి.. మండిపడ్డ పళని స్వామి

స్పీకర్‌ అప్పావుకు వ్యతిరేకంగా అన్నాడీఎంకే తీసుకొచ్చిన తీర్మానంపై చర్చ సందర్భంగా సీఎం స్టాలిన్‌ ప్రసంగించారు. ప్రజల విశ్వాసం కోల్పోయిన వారే ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని మండి పడ్డారు. వాస్తవానికి ఈ తీర్మానంపై ప్రజలు పరిహాసం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తమిళనాడు శాసనసభ శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న వేళ, స్పీకర్‌కు వ్యతిరేకంగా ఈ తీర్మానం విచారకరం అని పేర్కొన్నారు. తమ ప్రభుత్వాన్ని అవమాన పరిచేందుకు ప్రజాస్వామ్యం కల్పించిన హక్కును ఈ విధంగా వాడుకోవడం హేయనీయమన్నారు. గతంలో ఇదే విధంగా తీర్మానం విషయంలో జరిగిన పరిణామాలను గుర్తుచేస్తూ, అప్పటి స్పీకర్‌, ప్రస్తుత సభ స్పీకర్‌ పని తీరు మధ్య చాలా వ్యత్యాసాలు ఉన్నాయన్నారు. ప్రస్తుత స్పీకర్‌ నిష్పాక్షికంగా విధులను నిర్వహిస్తున్నారని , గతంలో ఆయన ఎమ్మెల్యేగా, మంత్రిగా కూడా పనిచేసిన అనుభవం ఉందన్న విషయాన్ని గుర్తెరగాలన్నారు. ప్రజాస్వామ్య సూత్రాలకు కట్టుబడి స్పీకర్‌ వ్యవహరిస్తున్నారని, నిజాయితీతో వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. తటస్థంగా ఉంటూ, అందర్నీ చిరు నవ్వులతో కలుపుకెళ్తున్నారని వివరించారు. ఉపాధ్యాయుడి నుంచి రాజకీయ నాయకుడిగా ఎదిగిన స్పీకర్‌ అప్పావు ప్రజాస్వామ్య వ్యవస్థలో శాసనసభ సభ్యులందరూ, ప్రతినిధులందరూ ఒకటేనని పేర్కొంటూ, సమానంగా చూస్తున్నారన్నారు. అధికార పక్షానికంటే ప్రతిపక్ష సభ్యులకు ఎక్కువ అవకాశాలు ఇస్తున్నారని పేర్కొంటూ, తమ ప్రభుత్వ పనితీరును విమర్శించేందుకు అస్త్రం దొరక్క, చివరకు స్పీకర్‌పై అవిశ్వాసంను ఎంపిక చేసుకున్నారని మండిపడ్డారు. వారి పార్టీలో సాగుతున్న అంతర్గత సమరాన్ని కప్పి పుచ్చుకునేందుకు ఈ తీర్మానం తెర మీదకు తెచ్చానని అన్నాడీఎంకేపై విరుచుకు పడ్డారు. ఒక మంచి వ్యక్తిపై ఇలాంటి నిర్ణయం తీసుకున్నామే అని అన్నాడీఎంకే వర్గాలను భవిష్యత్‌లో మనస్సాక్షి కలవరపెడుతుందని , తాజాగా సందించిన ఈ అస్త్రంను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. డీఎంకే కూటమి పార్టీలకు చెందిన నేతలందరూ తమ ప్రసంగాలలో స్పీకర్‌కు మద్దతుగా నిలబడ్డారు.

చివరకు సభలో అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌ జరిగింది. సమావేశ మందిరం మార్గాలన్నీ మూసి వేశారు. తొలుత సభ్యులు గొంతుక ఆధారంగా ఓటింగ్‌ నిర్వహించారు. అనంతరం డివిజన్‌ పద్ధతిలో ఓటింగ్‌ జరిగింది. తొలుత మద్దతు ఇచ్చేవారంతా తమ గళాన్ని వినిపించారు. అనంతరం లేచి నిలబడి డివిజన్‌ పద్ధతిలో ఓటింగ్‌ నిర్వహించారు. ఈరెండింటిలోనూ అన్నాడీఎంకేకు ఓటమి తప్పలేదు. డీఎంకే , కూటమి పార్టీల మద్దతుతో స్పీకర్‌ అప్పావు నెగ్గారు. అప్పావుకు మద్దతుగా 154 ఓట్లు పడ్డాయి. వ్యతిరేకంగా 63 ఓట్లు పడ్డాయి. దీంతో అన్నాడీఎంకే తీర్మానం వీగింది. అయితే, అన్నాడీఎంకే తీర్మానానికి అనుకూలంగా ఆ పార్టీ నుంచి బహిష్కరించ బడ్ద మాజీ సీఎం పన్నీర్‌ సెల్వం, ఆయన మద్దతు ఎమ్మెల్యేలు ఓటు వేశారు. అలాగే అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న సెంగోట్టయన్‌ సైతం స్పీకర్‌కు వ్యతిరేకంగానే ఓటు వేశారు. అన్నాడీఎంకేకు చెందిన ఎమ్మెల్యేలు ధనపాల్‌, ఇసిక్క సుబ్బయ్య, కందస్వామి ఓటింగ్‌కు హాజరు కాలేదు. బీజేపీ, పీఎంకే సభ్యులు సభకు హాజరు కాలేదు. తాను స్పీకర్‌కు వ్యతిరేకంగా ఓటు వేయడానికి కారణం అన్నాడీఎంకే జారీ చేసిన విప్‌ అని పన్నీరు సెల్వం పేర్కొన్నారు. తాము అన్నాడీఎంకే సభ్యులుగానే సభలో ఉన్నామని, ఆ పార్టీ విప్‌ జారీ చేసిన నేపథ్యంలో తాము పార్టీకి అనుకూలంగానే నిర్ణయం తీసుకున్నామన్నారు. అన్నాడీఎంకే తీర్మానం వీగి పోవడంతో స్పీకర్‌ అప్పావు మళ్లీ తన సీటులో కూర్చుని సభా వ్యవహారాలపై దృష్టి పెట్టారు. అదే సమయంలో గొంతుక , డివిజన్‌ రూపంలో ఓటింగ్‌ విషయంగా పళని స్వామితో సెంగోట్టయన్‌ సభలో మాట్లాడే సమయంలో వివరించడం గమనార్హం.

అవిశ్వాసంలో1
1/2

అవిశ్వాసంలో

అవిశ్వాసంలో2
2/2

అవిశ్వాసంలో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement