వేలూరు: బాలికలు ఉన్నత విద్యపై ఆశక్తి చూపి పరిశోధనలు చేసి దేశాభివృద్ధికి పాటు పడాలని ప్రభుత్వ మాజీ ముఖ్య కార్యదర్శి ఇరయన్బు అన్నారు. వేలూరు ధనభాగ్యం క్రిష్ణస్వామి మొదలియార్ మహిళా డిగ్రీ కళాశాలలో 50వ స్నాతకోత్సవం కళాశాల కార్యదర్శి మణినాథన్ అధ్యక్షతన శనివారం ఉదయం జరిగింది. ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లోను రాణిస్తున్నారని అందుకు కారణం విద్య ఒక్కటే అన్నారు. అధికంగా మహిళలు ఉన్నత విద్యకు దూరమవుతున్నారని, పట్టుదలతో ఉన్నత విద్యకు వెళితే ఉన్నత శిఖరాలకు చేరవచ్చన్నారు. ఇండియాలోనే ఉన్నత విద్యలో మన దేశం 75 శాతంగా ఉందన్నారు. వీటిలో తమిళనాడులో విద్యాభివృద్ధి 45 శాతంగా ఉందని తెలిపారు. ఒక మహిళ విద్యను అభ్యసిస్తే ఆ కుటుంబమే విద్యావేత్తలుగా ఉంటారన్నారు. డిగ్రీలు సాధించిన అందరూ ఉన్నత విద్యను అభ్యసించేందుకు ప్రయత్నం చేయాలన్నారు. ఇంటర్నెట్, వాట్సాప్‌లను పక్కన బెట్టి విద్యా సంబంధమైన పరిశోధనలు చేసేందుకు ఆశక్తి చూపాలన్నారు. అనంతరం యూజీ, పీజీ కోర్సులో ఉత్తీర్ణత సాధించిన 1,069 మంది విద్యార్థినులకు డిగ్రీ పట్టాలను అందజేశారు. కళాశాల ప్రిన్సిపల్ భానుమతి, విద్యార్థినులు పాల్గొన్నారు.