కొరుక్కుపేట: ప్రపంచ తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు శనివారం సాయంత్రం వేడుకగా జరిగాయి. నగరంలోని ఆళ్వారుపేటలో ఉన్న ఓ హోటల్ వేదికగా జరిగిన ఈ వేడుకలకు ప్రప్రంచ తెలుగు సమాఖ్య అధ్యక్షురాలు డాక్టర్ వీఎల్ ఇందిరాదత్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చైన్నె ఆదాయపు పన్ను శాఖ కమిషనర్ దావులూరి కోమలి కృష్ణ పాల్గొని మహిళా దినోత్సవం వేడుకలను ఘనంగా ప్రారంభించారు. ప్రపంచ తెలుగు సమాఖ్య తెలుగు భాష వికాసానికి చేస్తున్న సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. అనంతరం కర్ణాటక, సినీ గాయినీ జననీ సంజీవి సంగీత విభావరి ఆహుతులను మంత్రముగ్ధులను చేసింది. ఈ మహిళా దినోత్సవ కార్యక్రమ నిర్వహణను ప్రమీలా ఆనంద్, సురేఖ మోహన్ దాస్ లు చేపట్టారు. ప్రపంచ తెలుగు సమాఖ్య అధ్యక్షురాలు డాక్టర్ విఎల్ ఇందిరాదత్ అధ్యక్షోపన్యాసం చేస్తూ ప్రతీ ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ వేడుకల్లో భాగంగా క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభను చాటుకున్న ప్రపంచ తెలుగు సమాఖ్య సంయుక్త కోశాధికారి తాల్లూరి రుక్మిణీదేవిని జ్ఞాపికను బహుకరించి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో నవనారీమణుల పేరిట తొమ్మిది మంది ప్రముఖుల పాత్రలు పోషించిన మహిళలుగా విచ్చేసిన ఉప్పులూరి విజయలక్ష్మి, వెంకటరమణ, ఏ.జాన్సీ రత్నం, డీ హేమమాలిని, ఊరా శశికళ, పోతూరు రమాదేవి, రుక్మిణి దేవి, వినీషా వశిష్ట్, సౌమ్య వశిష్ట్ ఆయా వేషధారణలో ఆకట్టుకున్నారు. తంబూలా గేమ్స్ ను నిర్వహించి బహుమతులు అందజేశారు.