తిరుత్తణి: తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయ అనుసంధానంలోని తిరువలంగాడు ఆలయంలో కారైక్కాల్ అమ్మవారికి ఉత్సవాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం జీఓ జారీ చేసింది. దీంతో ఆలయంలో 16, 17 తేదీల్లో ఉత్సవాలు నిర్వహించనున్నారు. వేడుకల ఏర్పాట్లు, భక్తులకు సదుపాయాలు కల్పనకు సంబంధించి ఆలయ ప్రాంగణంలో శనివారం తిరుత్తణి ఆలయ జాయింట్ కమిషనర్ రమణి ఆధ్వర్యంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. తహసీల్దార్ మలర్‌విళి, డీఎస్పీ కందన్ సహా వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఉత్సవాల సందర్భంగా భక్తులకు తాగునీరు, తాత్కాలిక మరుగుదొడ్లు, బస కేంద్రాలు ఏర్పాటుతోపాటు పరిశుభ్రత, రవాణా సదుపాయాలు, తాత్కాలిక వైద్య కేంద్రాలు ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. అలాగే పోలీసుల భద్రతకు ఏర్పాట్లు, హైవే రోడ్డులో ఆక్రమణలు తొలగించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు.
సమస్యల పరిష్కారానికే సమీక్ష
వేలూరు: రాష్ట్ర వ్యాప్తంగా కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకే జిల్లాల వారిగా కార్మికులతో నేరుగా సమీక్షిస్తున్నట్లు కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్ పొన్‌కుమార్ అన్నారు. వేలూరులోని కార్మిక సంక్షేమ కార్యాలయంలో కమిషనర్ జ్ఞానవేల్ ఆధ్వర్యంలో కార్మికులతో నేరుగా సమీక్షించారు. ఈ సందర్భంగా కార్మికులు చెప్పన సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం 50 మంది కార్మికులకు రూ.15.55 లక్షల విలువ చేసే సంక్షేమ పథకాలను అందజేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 40 సంవత్సరాలు నిండిన భవన నిర్మాణ కార్మికులకు దేహదారుఢ్య కోసం ప్రత్యేక మెడికల్ కార్డును అందజేస్తామన్నారు. భవన నిర్మాణ కార్మికుల పిల్లల కోసం ఏడు జిల్లాల్లో ఐటీఐని ప్రారంభిస్తామని సీఎం ప్రకటించారని, వాటిని వేలూరులో కూడా ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కార్మికుల పెన్షన్‌ను రూ.3 వేలు చేయాలని సిఫారస్సు చేశామని, వెంటనే వీటిని అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ద్రావిడ మోడల్ ప్రభుత్వంలోనే కార్మికుల సంక్షేమం కోసం పలు పథకాలను తీసుకొచ్చారని, గత ప్రభుత్వంలో ఎటువంటి ప్రాజెక్టులు తీసుకు రాకపోవడంతోనే కార్మికుల సభ్యత్వం కూడా పూర్తిగా తగ్గిందన్నారు. ఇళ్లులేని ప్రతి కార్మికులకు ఇళ్ల నిర్మాణం కోసం రూ.4 లక్షలు అందజేసేందుకు సిద్ధంగా ఉన్నామని వీటిని కార్మికులు సద్వినియోగం చేసుకోవాని కోరారు. ఆయనతోపాటు భవన నిర్మాణ కార్మికుల అఖిల భారత అధ్యక్షుడు ఆర్టీ పయణి, జిల్లా అద్యక్షుడు వేల్‌మురుగన్, కార్మిక నేతలు పాల్గొన్నారు.
కారైక్కాల్ ఉత్సవ ఏర్పాట్లపై అధికారుల సమీక్ష