సాక్షి, చైన్నె: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడపాడి పళనిస్వామిపై ఎంపీ దయానిధి మారన్ దాఖలు చేసిన పరువు నష్టం కేసు విచారణపై మద్రాస్ హైకోర్టు మధ్యంతర స్టే విధిస్తూ శుక్రవారం ఆదేశించింది. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ ఎడపాడి పళనిస్వామి పిటిషన్ దాఖలు చేశారు. గత ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో, సెంట్రల్ చైన్నెలో డీఎంకె ఎంపీ దయానిధి మారన్ నియోజకవర్గ అభివృద్ధి నిధులను సరిగ్గా ఖర్చు చేయడం లేదని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడపాడి పళనిస్వామి ఆరోపించారు. ఈ ప్రసంగాన్ని ఖండించిన దయానిధి మారన్, ఎడపాడి పళనిస్వామిపై పరువు నష్టం దావా వేశారు. చైన్నె జిల్లా కలెక్టరేట్‌లో ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసులను విచారించే ప్రత్యేక కోర్టులో ఈ కేసు విచారణలో ఉంది. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ ఎడపాడి మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌లో, తాను వార్తాపత్రికల్లో ప్రచురితమైన వార్తల ఆధారంగా మాట్లాడానని, ఎన్నికల ప్రచారంలో చేసిన ప్రసంగాలు పరువు నష్టం కలిగించేవి కావని, కాబట్టి తనపై ఉన్న కేసును రద్దు చేయాలని అభ్యర్థించాడు. ఈ పిటిషన్ న్యాయమూర్తి జి.కె.ఇళందిరియన్ ముందు విచారణకు వచ్చింది. ఆ సమయంలో ఎడపాడి తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది జాన్ సత్యన్ వాదిస్తూ ఆయన వార్తాపత్రికలోని వార్తలు, ప్రభుత్వ వెబ్‌సైట్‌లోని డేటా ఆధారంగా మాత్రమే మాట్లాడానని, ఎటువంటి పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేయలేదని అన్నారు. వాదనల అనంతరం ఎంపీ, ఎమ్మెల్యేల కోర్టులో విచారణపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులను న్యాయమూర్తి జారీ చేశారు.
మాజీ కేంద్ర మంత్రికి సత్కారం
సాక్షి, చైన్నె: దేశానికి విశేష సేవలను అందించినందుకు భారత మాజీ కేంద్రమంత్రి సురేష్‌ప్రభును శ్రీశ్రీమల్ బలాద్ కుటుంబం, టీమ్ ట్రేడింగ్ కార్పొరేషన్ కంపెనీ సంయుక్తంగా సత్కరించుకుంది. శుక్రవారం చైన్నెలో జరిగిన కార్యక్రమంలో ప్రముఖులు పాల్గొన్నారు. ఈసందర్భంగా కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో దేశాభివృద్ధికి ఎనలేని సేవలను అందించారని ఆ సేవలకు గుర్తింపుగా సత్కార కార్యక్రమం నిర్వహించారు. ఇందులో కేంద్ర మాజీ మంత్రి సురేష్‌ప్రభుతోపాటు మరో ఇద్దరు న్యాయ ప్రముఖులు మద్రాస్ హైకోర్టు అదనపు సొలిసిటర్ జనరల్ ఆర్.శంకరనారాయణన్, సీనియర్ న్యాయవాది జయేష్ డోలియాను సత్కరించారు. సురేష్‌ప్రభు మాట్లాడుతూ ప్రజలకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియక ఆ కార్యక్రమాన్ని సమ్మతించానని తెలిపారు. తాను కేంద్ర హోంమంత్రిగా ఉన్నప్పుడు, విద్యుత్ కొరతను ఎదుర్కోవడానికి జరిగిన అతిపెద్ద ప్రయత్నాలను వివరించారు. దేశంలో 80 శాతం విద్యుత్ కొరత ఉందని ఆయన గుర్తు చేశారు. తన హయాంలో ఉచిత విద్యుత్ ప్రాజెక్టుపై తొలిసారి సంతకం చేసిన మాజీ ముఖ్యమంత్రి జయలలితను మరిచిపోలేమన్నారు. ఇందులో శ్రీశ్రీమల్ బలాద్ కుటుంబం, టీమ్ ట్రేడింగ్ కార్పొరేషన్ నిర్వాహకులు పాల్గొన్నారు.
మోటారు పంపుల తయారీ
నగరంగా కోవై
సాక్షి,చైన్నె: ప్రపంచంలోనే మోటారు పంపు సెట్ల తయారీ నగరంగా కోయంబత్తూరును తీర్చిదిద్దే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడాన్ని ఆహ్వానిస్తున్నామని భారత మోటారు పంపు తయారీదారుల సంఘం ప్రశంసించింది. ఇండియన్ పంప్ మ్యాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.వి. కార్తీక్ మాట్లాడుతూ, కోయంబత్తూరు మోటారు పంప్ పరిశ్రమను ప్రోత్సహించడానికి సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఏర్పాటును తమకు ఎంతో ఆనందకరంగా పేర్కొన్నారు. బడ్జెట్‌లో అధునాతన పంపుల తయారీకి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ప్రకటించినందుకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఆర్థిక మంత్రి తంగం తెన్నరసు, కోయంబత్తూర్ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి వి.సెంథిల్ బాలాజీలకు కృతజ్ఞతలు తెలుపుకున్నారు.
పరువు నష్టం కేసులో పళనికి ఊరట
పరువు నష్టం కేసులో పళనికి ఊరట