● అన్నాడీఎంకే, బీజేపీ వాకౌట్
సాక్షి, చైన్నె: టాస్మాక్‌లో ఈడీ దాడుల నేపథ్యంలో రూ.1000 కోట్ల స్కాం జరిగిందన్న ప్రచారం ఊపందుకుంది. ఈ వ్యవహారం శుక్రవారం అసెంబ్లీకి చేరింది. అసెంబ్లీ తొలి రోజు బడ్జెట్ దాఖలుకు ఆర్థికమంత్రి తంగం తెన్నరసు సిద్ధమయ్యారు. ఆసమయంలో అన్నాడీఎంకే శాసనసభా పక్ష ఉప నేత జోక్యం చేసుకుని టాస్మాక్ స్కాం అంటూ నినదించారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలని, చర్చకు పట్టుబట్టారు. శుక్ర, శనివారాలు కేవలం బడ్జెట్ దాఖలుకు మాత్రమే సమయం అని స్పీకర్ అప్పావు వారించారు. దీంతో ప్రధాన ప్రతి పక్ష నేత పళణిస్వామి జోక్యం చేసుకుని స్పీకర్‌తో కాసేపు వాగ్వాదానికి దిగారు. ఈ వ్యవహారాలన్నీ సభా రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్ ఆదేశించారు. దీంతో అసెంబ్లీ నుంచి అన్నాడీఎంకే సభ్యులు వాకౌట్ చేశారు. వీరు బయటకు వెళ్లగానే, ఇదే స్కాంను ఎత్తిచూపుతూ బీజేపీ సభ్యులు సైతం నినాదాలు అందుకున్నారు. సభ నుంచి వాకౌట్ చేశారు. అలాగే, రాష్ట్రలో శాంతి భద్రతలు క్షీణించాయని, అవినీతి పెట్రేగిందని నిరసన వ్యక్తం చేస్తూ సభ నుంచి మాజీ సీఎం పన్నీరుసెల్వంతో పాటు ఆయన మద్దతు ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. వెలుపల మీడియాతో పళణిస్వామి మాట్లాడుతూ రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలను వివరించారు. నాలుగైదు రోజులుగా టాస్మాక్ ప్రధాన కార్యాలయంలో ఈడీ సోదాలు జరిగాయని, ఇందులో వెయ్యికోట్లు చేతులు మారినట్టు ఆరోపణలు వ్యక్తం అవుతున్నట్టు పేర్కొన్నారు. టాస్మాక్ ద్వారా ప్రభుత్వానికి రూ.40 వేల కోట్లు వస్తున్నదని, ఇందులో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్టు ఆరోపించారు. డీఎంకేను తరిమికొట్టే రోజులు సమీపంలోనే ఉందని, ప్రజలు ఆ మేరకు ఆగ్రహంతో ఉన్నట్టు పేర్కొన్నారు. బీజేపీ అధ్యక్షుడు అన్నామలై పేర్కొంటూ ఈ స్కాంపై సమగ్ర విచారణకు డిమాండ్ చేస్తూ ఈనెల 17న నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. టాస్మాక్‌లో ఎలాంటి అవకతవకలు జరగలేదని, ఈడీ చర్యలను చట్టపరంగా ఎదుర్కొంటామని రాష్ట్ర ఎకై ్సజ్ మంత్రి సెంథిల్‌బాలాజీ మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు.
పసలేని బడ్జెట్
అసెంబ్లీలో తంగం తెన్నరసు బడ్జెట్ దాఖలు చేశారు. ఎలాంటి పన్నుపోటు, కొత్త భారం అన్నది లేకుండా పాత పథకాలకు నిధులు, కొత్త ప్రాజెక్టులు అంటూ ప్రసంగం ముగించారు. అయితే, ఈ బడ్జెట్‌పై అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామి తీవ్ర విమర్శలు చేశారు. విద్యార్థులకు రుణాలను మాఫీ చేయని వాళ్లు, విద్యార్థులకు ఎక్కడి నుంచి ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు ఇస్తారని ప్రశ్నించారు. కేవలం ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కొన్ని వాగ్దానాలను మమా అనిపించారని, ఈ బడ్జెట్‌తో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. బీజేపీ అధ్యక్షుడు అన్నామలై పేర్కొంటూ, ఈ బడ్జెట్‌లో ఏమీ లేదని, పాత వాటికి రంగులు వేసుకున్నారని విమర్శించారు. కాగా బడ్జెట్‌లో ఇండియన్ కరెన్సీ సింబల్‌ను తొలగించి తమిళ అక్షరంగా ‘రూశ్రీ’ వాడడాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఖండించారు. విభజన వాద రాజకీయాలను డీఎంకే చేస్తున్నట్టు మండిపడ్డారు. తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ పేర్కొంటూ బడ్జెట్‌లో ప్రజలను పూర్తిగా ఈ పాలకులు విస్మరించారని మండిపడ్డారు. త్వరలో డీఎంకేను ఇంటికి పంపించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
అసెంబ్లీకి టాస్మాక్ స్కాం