● అసెంబ్లీలో ఆర్థిక పద్దు ● దాఖలు చేసిన ఆర్థికమంత్రి తంగం తెన్నరసు ● అప్పులు 9 లక్షల కోట్లు ● పథకాలకు నిధుల వరద ● మహిళలకు అందలం ● ఉద్యోగులకు కానుక ● నేడు వ్యవసాయ బడ్జెట్
సాక్షి, చైన్నె: ఆర్థిక మంత్రి తంగం తెన్నరసు తనదైన శైలిలో రాష్ట్ర బడ్జెట్‌ను శుక్రవారం అసెంబ్లీలో దాఖలు చేశారు. తమిళనాడు భవిష్యత్తుకు దిక్సూచీగా పేర్కొంటూ పద్దుల చిట్టాను వివరించారు. రాష్ట్ర అప్పులు రూ. 9 లక్షల కోట్లకు చేరినట్టు ప్రకటించారు. పథకాలకు నిధుల వరద పారిస్తూ, చైన్నె శివారులో గ్లోబల్ సిటీ నిర్మాణం, రోడ్లు, వంతెనల ఏర్పాటు వంటి కొత్తప్రగతి పథకాలను ప్రకటించారు. ప్రభుత్వ విభాగాల్లో ఖాళీల భర్తీతో పాటు ఉద్యోగులకు ఈఎల్ (ఎర్న్‌డ్ లీవ్ సరెండర్ సిస్టమ్)ను మళ్లీ పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
2025–26 సంవత్సరానికిగాను ఆర్థిక బడ్జెట్‌ను సభలో మంత్రి తంగం తెన్నరసు ప్రవేశ పెట్టేందుకు ముందుగా సీఎం స్టాలిన్‌ను కలిసి ఆశీస్సులు అందుకున్నారు. ఆయనతో పాటు ఆర్థిక శాఖ అధికారులు బడ్జెట్ గురించి సీఎంతో చర్చించినానంతరం అసెంబ్లీకి బయలుదేరారు. అసెంబ్లీ, స్పీకర్ అప్పావు అధ్యక్షతన సభ సరిగ్గా 9.30 గంటలకు మొదలైంది. మధ్యాహ్నం 12.10 గంటల వరకు బడ్జెట్ ప్రసంగం 2.40 గంటలు సాగింది. ఆర్థిక మంత్రి తంగం తెన్నరసు బడ్జెట్ ప్రసంగానికి సిద్ధం కాగా, అన్నాడీఎంకే సభ్యులో ఓ అంశాన్ని ప్రస్తావిస్తూ స్పీకర్‌తో వాగ్వాదానికి దిగారు. ఇందుకు ఇది సమయం కాదంటూ స్పీకర్ వారించారు. అనంతరం సభలో పూర్తి స్థాయి బడ్జెట్‌ను తంగం తెన్నరసు దాఖలు చేశారు.
తమిళనాడులో విద్య, ఆరోగ్యం వంటి అంశాలను గుర్తు చేస్తూ శాంతి సామరస్యాల గురించి ప్రస్తావించారు. పేదరిక నిర్మూలనకు చేపట్టిన కార్యక్రమాలను విశదీకరించారు. తమిళ భాషాభ్యున్నతి గురించి ప్రస్తావిస్తూ ఈ రాష్ట్ర భవిష్యత్తుకు దిక్సూచీగా నిలిచే విధంగా పలు పథకాలు, అంశాలకు నిధులను కేటాయిస్తూ బడ్జెట్ రూపకల్పన చేశామని వివరించారు. తిరుక్కురల్‌ను అన్ని ప్రపంచ భాషల్లో అనువదించేందుకు, విదేశాలలో సైతం పుస్తక ప్రదర్శనల ఏర్పాటుకు నిధులను కేటాయిస్తూ తొలి ప్రకటన చేశారు. కిలడి, తూత్తుకుడి, నాగపట్నం, కడలూరు, తెన్‌కాశి ప్రాంతాల్లో పురావస్తు తవ్వకాలు విస్తృతం చేయడం, మ్యూజియంల ఏర్పాటు, ఎగ్మూర్ మ్యూజియంలో సింధులోయ నాగరికత ఆవిష్కరణ, మహాబలిపురం ప్రగతి వంటి అంశాలను ప్రస్తావిస్తూ, నిధులను కేటాయించారు. ఈ ఏడాది రూ.3,500కోట్లతో లక్ష గృహాలను నిర్మించనున్నారు.
అప్పులు రూ.9 లక్షల కోట్లు
రాష్ట్ర అప్పు రూ.9 లక్షల కోట్లను దాటింది. బడ్జెట్‌లో ఆదాయ వ్యయ వివరాల సమయంలో ఈ ప్రకటన చేశారు. ఈ ఏడాది బడ్జెట్ లోటు రూ. 41,634 కోట్లుగా చూపించారు. రానున్న కాలంలో ఈ లోటు క్రమంగా తగ్గుతుందని వివరించారు. 2025–26 ప్రభుత్వం 1,62,096.76 కోట్ల అప్పులు తీసుకునేందుకు నిర్ణయించింది. అలాగే, 55,844.53కోట్ల విలువగల అప్పును తిరిగి చెల్లించనున్నారు. గత ఏడాది 8 లక్షల కోట్లుగా అప్పులు ఉండగా ప్రస్తుతం రూ. 9 లక్షల కోట్లను దాటింది. ఇక, బడ్జెట్ సమావేశాలను ఏప్రిల్ 30వ తేదీ వరకు నిర్వహించనున్నారు. శనివారం వ్యవసాయ బడ్జెట్ దాఖలు చేయనున్నారు. సోమవారం నుంచి బడ్జెట్ చర్చ. మార్చి 24వ తేదీ నుంచి ఏప్రిల్ 30వ తేదీ వరకు శాఖల వారీగా నిధుల కేటాయింపు చర్చ జరుగుతుందని స్పీకర్ అప్పావు ప్రకటించారు.
బడ్జెట్ ప్రకటనలో కొన్ని ముఖ్యాంశాలు
ప్రభుత్వ ఉద్యోగులకు ఎర్న్‌డ్ లీవ్ సరెండర్ సిస్టమ్‌ను 2024 ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలు చేయనున్నారు. ప్రభుత్వంలోని వివిధ విభాగాలలోని 40వేల ఖాళీలను భర్తీ చేయనున్నారు. బడుల్లో 1,721 పీజీ టీచర్ల నియామకానికి చర్యలు
రెండు సంవత్సరాల్లో రూ.2 వేల కోట్లతో 20 లక్షల మంది విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు లేదా ట్యాబ్‌ల పంపిణీ
పాఠశాలలో చెస్ క్రీడపై మక్కువ పెంచే విధంగా పాఠ్యాంశం, వ్యాయామ పాఠ్యాంశాలలో మార్పునకు నిర్ణయం. కున్నూరు, నత్తంచైన్నె ఆలందూరు, విక్రవాండి, సెయ్యూరు సహా 10 చోట్ల ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలు ఏర్పాటు.
యువజన క్రీడల శాఖకు రూ. 572కోట్ల కేటాయింపు. మొబైల్ వైద్య సేవలతో క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధుల చికిత్సకు పరికరాల కొనుగోలుకు రూ. 40 కోట్లు కేటాయించారు. క్యాన్సర్‌ను ప్రారంభంలోనే గుర్తించే పరికరాన్ని రూ.110 కోట్లతో కొనుగోలు చేయనున్నారు. గర్భాశయ క్యాన్సర్ నివారణ దిశగా టీకాలు వేయడానికి రూ. 36 కోట్లు, కాంచీపురంలో అన్నా స్మారక క్యాన్సర్ ఆస్పత్రి హోదా పెంపునకు రూ.120 కోట్లు అంటూ తమిళనాడు ప్రభుత్వ ఆరోగ్య శాఖకు రూ.21,096 కోట్లు కేటాయించారు.
హొసూరులో రూ.400 కోట్లతో టైడల్ పార్క్, సైన్స్ సెంటర్ ఏర్పాటు, విరుదునగర్‌లో మినీ టైడల్ పార్క్, మదురై మేలూరు, కడలూరులలో పాదరక్షల పార్క్‌ను రూ.250 కోట్లతో ఏర్పాటు చేయనున్నారు. దీని ద్వారా 20 వేల మందికి ఉద్యోగాలు కేటాయించనున్నారు. పుదుకోట్టైలో 200 ఎకరాల్లో కొత్త పారిశ్రామక వాడ ఏర్పాటు, పరందూరులో కొత్త విమానాశ్రయ ఏర్పాటు పనులు త్వరలో వేగవంతం చేయనున్నారు. పారిశ్రామిక పెట్టుబడులను ప్రోత్సహించే విభాగానికి రూ.3,915కోట్లు కేటాయించారు. స్పేస్ రంగంలో పరిశోధనలు, పరిశ్రమల ప్రోత్సాహానికి నిధులు అంటూ ఎంఎంఎస్‌ఈ విభాగానికి రూ.1,918 కోట్లు కేటాయించారు.
చైన్నె కార్పొరేషన్ రూ. 50 కోట్లతో నైపుణ్యాల అభివృద్ధి కేంద్రం ఏర్పాటు. ఐటీశాఖకు రూ.131కోట్ల కేటాయింపు.
వాటర్ మేనేజ్‌మెంట్ పథకం అమలుకు రూ.2వేల కోట్లు.
వెల్లిమలై, ఆలియారు పరిధిలో రూ.11, 721 కోట్లతో కొత్తగా 2 థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటు. విద్యుత్‌శాఖకు రూ. 21,168 కోట్ల కేటాయింపు.
మత సామరస్యాన్ని పరిరక్షించే గ్రామ పంచాయతీలను ప్రతి ఏటా 10 ఎంపిక చేయనున్నారు. తలా ఒక కోటి అభివృద్ధి లక్ష్యంగా ప్రత్యేక నిధి కేటాయింపు.
చైన్నె, మదురై, కోయంబత్తూరుల కోసం 1,125 విద్యుత్ బస్సుల కొనుగోలు.
1000 సంవత్సరాల పురాతనమైన ఆలయ జీర్ణోద్ధరణ పనులకు రూ.125 కోట్లు కేటాయింపు.
చైన్నె సైదా పేటలో రూ. 110 కోట్లతో 190 గృహాల నిర్మాణం.
రామనాథపురంలో రూ.21 కోట్లతో నావల్ ఎగ్జిబిషన్. కొత్తగా విమానాశ్రయం ఏర్పాటు
చైనె శివారులో 2 వేల ఎకరాల్లో గ్లోబల్ సిటీ రూపకల్పన,
ఉమ్మడి తాగునీటి పథకం అమలుకు రూ. 21,678 కోట్ల కేటాయింపు, చైన్నెకు తాగు నీరు అందించేందుకు కోవలం– తిరుప్పోర్ మధ్య రూ. 350 కోట్లతో కొత్తగా రిజర్వాయర్ నిర్మాణం.
పది కార్పొరేషన్లలో సీనియర్ సిటిజన్ల కోసం రూ.10 కోట్లతో అన్బుచోళై మయంల ఏర్పాటు.