తిరుత్తణి: ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిన స్థలంలో ఇళ్ల నిర్మాణాలకు తహసీల్దార్ అనుమతి నిరాకరణతో బాధితులు ఆర్డీఓ కార్యాలయం ముట్టడించి శుక్రవారం నిరసన తెలిపారు. ఆర్కేపేట యూనియన్‌లోని ఎస్‌వీజీ.పురం గ్రామంలో 1999లో ఆదిద్రావిడ సంక్షేమ శాఖ, బీసీ సంక్షేమ శాఖ సంయుక్తంగా 297 పేద కుటుంబాలకు ఉచిత ఇంటి స్థలాలు ఇచ్చి పట్టాలు అందజేశారు. ప్రస్తుతం వంద మంది అర్హులు ఇళ్లు నిర్మించుకుని నివాశముంటున్నారు. అయితే 200 మంది అర్హులు పేదరికంతో ఇళ్లు నిర్మించుకోలేక అద్దె ఇళ్లలో నివాశముంటున్నారు. ప్రభుత్వం ఉచిత ఇంటి పట్టాలు ఇచ్చి పాతికేళ్లు అవడంతో కొంతమంది అర్హులు ఇళ్ల నిర్మాణ పనులు చేపట్టారు. అయితే పాతికేళ్లుగా ఇళ్లు నిర్మించుకోక పోవడంతో ఉచిత ఇంటి పట్టాలు రద్దు చేసినట్లు కొత్తగా ఇళ్లు నిర్మాణానికి అనుమతి లేదని తహసీల్దార్ రాజేష్‌కుమార్ బాధితులు ఇళ్ల నిర్మాణ పనులను అడ్డుకున్నట్లు తెలిసింది. దీంతో బాధితులు ఆర్డీఓ కార్యాలయం ముట్టడించి తమకు న్యాయం చేయాలని ఉచిత ఇంటి స్థలాల్లో తాము ఇళ్లు నిర్మించుకున్న నివాసాలకు అనుమతివ్వాలని కోరుతూ ఆర్డీఓ దీపకు వినతిపత్రం అందజేశారు. విచారణ చేసి న్యాయం చేస్తామని ఆర్డీఓ హామీ ఇచ్చారు.