సాక్షి, చైన్నె: మరో 19 జిల్లాలకు కార్యదర్శులను నియమిస్తూ తమిళగ వెట్రి కళగం నేత విజయ్ గురువారం ప్రకటించారు. ఇందులో అతిపెద్ద అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగాను, చిన్న నియోజకవర్గాలు రెండింటిని ఓ జిల్లాగాను ప్రకటించారు. పార్టీ బలోపేతం దిశగా ముందుకెళ్తున్న విజయ్ రాష్ట్ర వ్యాప్తంగా 234 అసెంబ్లీ నియోజకవర్గాలను విభజించి పార్టీపరంగా 121 జిల్లాల ఏర్పాటుకు చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఐదు విడుతలుగా 95 జిల్లాలకు కార్యదర్శులు, ఇతర కమిటీ సభ్యులను ప్రకటించారు. వీరందరితోనూ పోటోలు దిగుతు ఆ యా పదవుల నియామకానికి సంబంధించిన ఉత్తర్వులను విజయ్ స్వయంగా అందిస్తూ వస్తున్నారు.ఈ పరిస్థితులలో గురువారం మరో 19 జిల్లాల కార్యదర్శులను నియమించారు. దీంతో పార్టీ కార్యాలయం ఆవరణలో సందడి వాతావరణం నెలకొంది. ఈ మరో ఏడు జిల్లాలకు మాత్రమే ఇక కమిటీ ప్రకటించాల్సి ఉంది. ఈ ప్రకటన తరువాయి విజయ్ రాష్ట్ర పర్యటనకు సిద్ధమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా గురువారం విజయ్‌ను చూసేందుకు తన కుమారుడితో వచ్చిన ఓ మహిళకు అనుమతి దక్కలేదు. దీంతో ఆమె తీవ్ర ఆవేదనతో ఆందోళనకు దిగడంతో అక్కడున్న పార్టీ వర్గాలు అడ్డుకున్నాయి.