● పలు పార్టీల సమాచారం
సాక్షి, చైన్నె: లోక్‌సభ నియోజకవర్గ పునర్విభజనకు వ్యతిరేకంగా జరగనున్న జాయింట్ యాక్షన్ కమిటీ కి హాజరయ్యేందుకు పలు రాష్ట్రాల పార్టీలు సిద్ధమవుతున్నాయి. తమ తరపున ప్రతినిధులను పంపించేందుకు నిర్ణయించాయి. పునర్విభజన పేరిట కేంద్ర ప్రయత్నాలను అడ్డుకునేందుకు రాష్ట్ర, దక్షిణాధి రాష్ట్రాలలోని ఎంపీలతో జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటుకు సీఎం స్టాలిన్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈనెల 22వ తేదిన చైన్నెలో ఈ జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం జరగనున్నది. ఈ సమావేశానికి హాజరు కావాలని ఆయా రాష్ట్రాల పార్టీల నేతలను డీఎంకే మంత్రులు, ఎంపీల బృందం కలిసి స్టాలిన్ తరపున ఆహ్వానాలు అందిస్తూ వస్తున్నాయి. ఇందులో భాగంగా ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ జేఏసీ సమావేశానికి బీజేడీ ఎంపీలను పంపించేందుకు నిర్ణయించారు. అలాగే మరికొన్ని పార్టీలు సైతం తమ ప్రతినిధులు హాజరు అవుతారన్న సమాచారం డీఎంకే ప్రభుత్వ అధికారులకు పంపించారు. గురువారం ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిని మంత్రి వేలు, ఎంపీ విల్సన్ కలిసిన విషయం తెలిసిందే. కర్ణాటక సీఎంసిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి శివకుమార్‌ను మంత్రి పొన్ముడి నేతృత్వంలోని బృందం కలిసింది. కాంగ్రెస్ అధిష్టానంకు సమాచారం అందించి ఈ సమావేశానికి ప్రతినిధులను పంపిస్తామని సూచించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. గురువారం ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సీనియర్ మంత్రి పొన్ముడి, ఎంపీ కనిమొళి తదితరులు కలిశారు. పునర్విభజన ప్రక్రియ దక్షిణాది రాష్ట్రాలకు వ్యతిరేకంగా ఉందని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించడమే కాకుండా సమావేశానికి హాజరవుతామని హామీ ఇవ్వడం విశేషం. అలాగే, మంత్రి పొన్ముడి, ఎంపీ ఎన్‌ఆర్ ఇలంగోవన్‌లతో కూడిన బృందం సాయంత్రం హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌కువెళ్లారు. బీఆర్‌ఎస్ నేత కేటీఆర్, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, మధుసూదనాచారి, వేముల ప్రశాంత్‌రెడ్డి, వద్ది రాజు రవిచంద్ర, దామోదర్ రావులను కలిశారు. కేటీఆర్‌కు సీఎం స్టాలిన్ పంపించిన ఆహ్వాన లేఖను అందజేశారు. జేఏసీ సమావేశానికి హాజరు కావాలని కోరారు. పునర్విభజన రూపంలో ఎదురయ్యే పరిస్థితులను వివరించారు.