సాక్షి, చైన్నె : ఐఐటీ మద్రాసులో సీఎఫ్‌ఐ ఓపెన్ హౌస్ 2025 స్టూడెంట్స్ టెక్ ఎక్స్ పో జరగనుంది. ఈనెల 15వ తేదీన కొత్త విద్యా సముదాయం (ఎన్‌ఏసీ)లో ఐఐటీ మద్రాసు డైరెక్టర్ వీ కామకోటి ఈ ఎక్స్‌పోను ప్రారంభించనున్నారు. భారతదేశంలోని విద్యార్థులచే నిర్వహించనున్న అతి పెద్ద ఆవిష్కరణ ప్రయోగశాలల్లో ఒకటైన సెంటర్ ఫర్ ఇన్నోవేషన్(సీఎఫ్‌ఐ) విభిన్న సాంకేతిక డొమైన్‌లలో విస్తరించి ఉన్న 14 క్లబ్‌లు, జాతీయ, అంతర్జాతీయ ఈవెంట్లలో చురుకుగా పోటీపడే ఎనిమిది పోటీ జట్లను కలిగి ఉన్నట్టు గురువారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఏటా నిర్వహించే ఈ కార్యక్రమంలో పూర్తిగా విద్యార్థులే రూపొందించిన, నిర్మించిన ఉత్పత్తులు ప్రదర్శించనున్నారు. ఈ కార్యక్రమం ప్రాజెక్టులు, పరిశ్రమ, పూర్వ విద్యార్థుల నుంచి మరింత మద్దతును ఆకర్షించడానికి ఒక ప్రత్యేకమైన వేదికగా ఈ ఎక్స్‌పో నిలవబోతోందన్నారు.