● 15 మండలాలలో ఏర్పాటుకు నిర్ణయం
చైన్నెలో ఎలక్ట్రిక్ వెహికల్స్ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు కార్పొరేషన్ నిర్ణయించింది. విద్యుత్ బోర్డు సహకారంతో ఈ స్టేషన్ల ఏర్పాటుకు కసరత్తులు మొదలెట్టారు. చైన్నె నగరంలో ఇటీవల కాలంగా ఎలక్ట్రిక్ వాహనాల ఉపయోగం పెరిగింది. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలే కాదు, ఎలక్ట్రిక్ బస్సులు సైతం రోడ్డెక్కి ఉన్నాయి. అలాగే ఎలక్ట్రిక్ ఆటోలు సైతం ఇటీవల నగరంలోకి ప్రవేశించాయి. ఎలక్ట్రిక్ వాహనాల వాడకం క్రమంగా పెరుగుతుండటంతో వీటీ ఛార్జింగ్ కోసం ప్రత్యేక స్టేషన్ల ఏర్పాటుపై గ్రేటర్ చైన్నె కార్పొరేషన్ దృష్టి పెట్టింది. చైన్నె నగరంలోని తిరువొత్తియూరు, మనలి, మాధవరం, తండయార్ పేట, రాయపురం, తిరువీకానగర్, అంబత్తూరు, అన్నానగర్, తేనాం పేట, కోడంబాక్కం, వలసరవాక్కం, ఆలందూరు, పెరుంగుడి, షోళింగనల్లూరు మండలాలలో మండలానికి ఒకటి చొప్పున తొలి విడతగా ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం స్థల పరిశీలన, ఎంపికకు గ్రేటర్ చైన్నె అధికారులు బుధవారం నిర్ణయించారు. ఇప్పటికే నగరంలో కొన్ని చోట్ల ప్రైవేటు చార్జింగ్ స్టేషన్లు ఉండగా, ప్రస్తుతం కార్పొరేషన్ నేతృత్వంలో ప్రభుత్వ చార్జీంగ్‌స్టేషన్లు ఏర్పాటు కానున్నడం వాహనదారులకు మరింత ఉపయగకరం కానుంది.
సాక్షి, చైన్నె