● కొరతకు ఛాన్స్ ఇవ్వకుండా చర్యలు
సాక్షి, చైన్నె: రాష్ట్రంలో విద్యుత్ వాడకం అమాంతంగా పెరిగింది. రోజుకు సుమారు 19 వేలకు పైగా మెగావాట్ల విద్యుత్ వినియోగం జరుగుతోంది. మున్ముందు రోజులలో 22 వేల మెగావాట్లకు సంఖ్య చేరే అవకాశాలు ఉన్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి నెలాఖరు నుంచిక్రమంగా భానుడు తన ప్రతాపం చూపించడం మొదలెట్టిన విషయంతెలిసిందే. దీంతో విద్యుత్ వాడకం పెరిగినట్టైంది. అదే సమయంలో మంగళ చైన్నె, శివారు జిల్లాలలో వాతావరణం మారింది. వర్షం పడింది. అయితే, బుధవారం వర్షంతెరమరుగై భానుడు ప్రత్యక్షమయ్యాడు. అయితే,తూత్తుకుడి, తిరునల్వేలి, తెన్‌కాశి, రామనాధపురం తదితర దక్షిణ తమిళనాడులోని పలు జిల్లాలో వర్షం బుధవారం సైతం కొనసాగింది. ఈ వర్షాలు ఆగగానే మరింతగా ఎండవేడిమి పెరిగే పరిస్థితులు ఉన్నాయి. దీంతో విద్యుత్ వాడకం అమాంతంగా పెరిగే అవకాశాలు అధికమే. గత నెల రోజుకు 15 వేల మెగావాట్ల విద్యుత్ వినియోగం జరగ్గా, ప్రస్తుతం 19 వేల మెగావాట్లకు చేరింది. మున్ముందు రోజులలో ఈ సంఖ్య 22 వేల మెగావాట్లకు చేరవచ్చని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో 2.5 కోట్ల గృహ కనెక్షన్లు, 40 లక్షల వర్తక,పరిశ్రమ కనెక్షన్లు, 25 లక్షల వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి. వీటన్నింటికీ ఎలాంటి ఆటంకం అన్నది కలగకుండా విద్యుత్ సరఫరా అందించేందుకు వీలుగా అధికారులు కసరత్తు మొదలెట్టారు. అన్ని అవకాశాలు సద్వినియోగం చేసుకుని విద్యుత్ కొనుగోళ్ల మీద దృష్టి పెట్టారు. ప్రస్తుతానికి కోతలకు ఆస్కారం లేకుండా విద్యుత్ అందిస్తున్నప్పటికీ, మున్ముందు కోతలు ఎదురయ్యేనా అన్న ఆందోళన తప్పడం లేదు. ఇందుకు కారణం ఏసీల వాడకం పెరగడమే. అయితే, విద్యుత్ కోతలకు ఆస్కారంలేకుండా సరఫరా చేస్తామని అధికారులు పేర్కొంటున్నారు. ఇదిలాఉండగా,రాష్ట్రంలోని అన్ని కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లను అమర్చేందుకు ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రెండో విడతగా స్మార్ట్ మీటర్ల కొనుగోలుకు టెండర్లను ఆహ్వానిస్తూ బుధవారం ప్రకటన వెలువడింది.