పరస్పరం కరచాలనం
సాక్షి, చైన్నె: రాష్ట్ర ప్రభుత్వ ద్రావిడ మోడల్, ద్రావిడ సిద్ధాంతకర్త పెరియార్‌కు వ్యతిరేకంగా నామ్ తమిళర్ కట్చి కన్వీనర్ సీమాన్ తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలు, చర్చకు, దుమారానికి సైతం దారి తీస్తున్నాయి. ఆయనకు వ్యతిరేకంగా అనేక పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు కూడా చేరాయి. అదేసమయంలో నటి విజయలక్ష్మి తనపై ఇచ్చిన లైంగిక దాడి కేసును సైతం ఆయన సమర్థంగా ఎదుర్కొంటూ వస్తున్నారు. తన దైన శైలిలో దూసుకెళ్తున్న సీమాన్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ప్రశంసలు కురిపించారు. ఓ కార్యక్రమానికి హాజరైన ఈ ఇద్దరు నేతలు బుధవారం ఎదురు పడ్డారు. అన్నామలై నడుచుకుంటూ తన కారు వద్దకు వెళ్తుండగా, సీమాన్ మరో కారులో అదే సమయంలో ఎదురు వచ్చారు. సీమాన్‌ను చూడగానే జరగండి..జరగండి అంటూ ఆయన కారు వద్దకు అన్నామలై వెళ్లారు. ఆయనతో కరచాలనం చేశారు. గుడ్ ఫైట్ బ్రదర్, గుడ్ ఫైట్, బలంగా ఉండండి...బలంగా ఉండండి అంటూ ఆయన కేస్తున్న పోరాటాలకు తన మద్దతు ఇచ్చే విధంగా అన్నామలై స్పందించడం గమనార్హం.
కాలువల్లో సైలెన్ బాటిళ్లతో దోమల నివారణ
● కార్పొరేషన్ కొత్త ప్రయత్నం
అన్నానగర్: ఆసుపత్రుల్లో వాడే ’గ్లూకోజ్’ బాటిళ్లతో చైన్నెలోని కాలువల్లో దోమల నిర్మూలించేందుకు కార్పొరేషన్ కొత్త ప్రయత్నం ప్రారంభించింది. చైన్నెలో అడయార్, కూవం, బకింగ్‌హామ్, ఒట్టేరి నల్లా కెనాల్ సహా 30కి పైగా జలమార్గాలు ఉన్నాయి. అలాగే వర్షపు నీటి కాలువల్లో 365 రోజుల పాటూ మురుగు నీరు నిలిచి దోమలు వృద్ధి చెందుతాయి. దీంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. చైన్నె కార్పొరేషన్ తరఫున ఉదయం, సాయంత్రం వేళల్లో పొగ వ్యాపించే యంత్రాల ద్వారా దోమల నిర్మూలన పనులు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఆసుపత్రుల్లో ఉపయోగించే ’గ్లూకోజ్’ బాటిళ్లను (ట్రిప్స్ బాటిల్స్) ఉపయోగించి నీటి మార్గాలు, మురుగు కాలువల నుంచి దోమలను నిర్మూలించేందుకు చైన్నె కార్పొరేషన్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మొదటి దశలో అంబత్తూరు మండల పరిధిలోని కాలువల్లో ఈ పనులు ప్రారంభించారు. అంబత్తూరు, కొరట్టూరు, బడి, పరిసర ప్రాంతాల్లో దోమల ఉత్పత్తిని అరికట్టేందుకు కార్పొరేషన్ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.
క్రీడా ప్రోత్సాహం
సాక్షి, చైన్నె : నున్‌చాకు ఉపకరణంతో ఒక నిమిషంలో 159 నున్‌చాకు బ్యాక్ హ్యాండ్‌రోల్స్ చేసి గిన్నిస్ రికార్డు సాధించిన తమిళనాడు క్రీడాకారిణి ఝాన్సీరాణి లక్ష్మీభాయ్ బుధవారం డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్, క్రీడల కార్యదర్శి అతుల్య మిశ్రా, స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ అథారిటీ సభ్య కార్యదర్శి జె.మేఘనాథరెడ్డిలను కలిసి తను సాధించిన రికార్డును చూపించారు. ఈ సందర్భంగా ఆ క్రీడాకారిణిని ఉదయనిధి స్టాలిన్ సత్కరించారు. అలాగే ఛాంపియన్ ఆఫ్ ప్యూచర్ అకాడమీకి ఎంపికై న తమిళనాడుకు చెందిన బైక్ బాలరేసర్ రోహన్ ఖాన్ రషీద్‌ను ఉదయనిధి సత్కరించి రూ.5 లక్షల నగదు ప్రోత్సాహాన్ని అందచేశారు.
ఏప్రిల్ 1 నుంచి పరీక్షలు
సాక్షి, చైన్నె : రాష్ట్రం పాఠశాలలో ఒకటో తరగతి నుంచి 9వ తరగతి వరకు చివరి పరీక్ష తేదిలను పాఠశాల విద్యా శాఖ బుధవారం సాయంత్రం వెల్లడించింది. ఈ మేరకు 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చదువుకుంటున్న విద్యార్థులకు ఏప్రిల్ 1వ తేదీ నుంచి 21వ తేది వరకు, 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు చుదువుకుంటున్న విద్యార్థలకు ఏప్రిల్ 8వ తేది నుంచి 24వ తేది వరకు చివరి పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు.
తిరువణ్ణామలైకి నేడు 350 ప్రత్యేక బస్సులు
తిరువొత్తియూరు: పౌర్ణమి సందర్భంగా తిరువణ్ణామలైలో గిరి ప్రదక్షిణకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం చైన్నె నుంచి తిరువణ్ణామలైకి 350 ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రభుత్వ రవాణా సంస్థ ఓ ప్రకటనను విడుదల చేసింది. పౌర్ణమిని పురస్కరించుకుని నేడు 13వ తేదీ చైన్నె నుంచి తిరువణ్ణామలైకి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు పేర్కొంది.
సీమాన్‌కు అన్నామలై ప్రశంస
సీమాన్‌కు అన్నామలై ప్రశంస