ప్రత్యేక బృందాల ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

ప్రత్యేక బృందాల ఆహ్వానం

Mar 13 2025 11:52 AM | Updated on Mar 13 2025 11:47 AM

సాక్షి, చైన్నె: తమిళనాడు సీఎం స్టాలిన్‌ తరపున ఆహ్వానాన్ని అందజేశారు. లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్యను తమిళనాడుతో పాటూ దక్షిణ భారత దేశంలోని రాష్ట్రాలలో తగ్గించేందుకు పునర్విభజన అస్త్రంతో కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను ఆదిలోనే అడ్డుకునేందుకు సీఎం స్టాలిన్‌ అడుగుల వేగాన్ని పెంచిన విషయం తెలిసిందే. ఇప్పటికే రాష్ట్రంలోని యాభైకు పైగా పార్టీలతో అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించారు. కేంద్ర ప్రయత్నాలను అడ్డుకునేందుకు రాష్ట్ర, దక్షిణాది రాష్ట్రాలలోని ఎంపీలతో జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. ఈనెల 22వ తేదీన చైన్నెలో ఈ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ సమావేశానికి నిర్ణయించారు. ఇప్పటికే పలు రాష్ట్రాల సీఎంలు, మాజీ సీఎంలు, ముఖ్య పార్టీల నేతలకు సీఎం స్టాలిన్‌ లేఖ రాశారు. ఈ పరిస్థితుల్లో డీఎంకే ప్రతినిధుల బృందం వారిని స్వయంగా కలిసి ఆహ్వానం పలికే పనిలో నిమగ్నమైంది. మంగళవారం ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్‌కు మంత్రి టీఆర్‌బీ రాజ, ఎంపీ దయానిధి మారన్‌ నేతృత్వంలోని బృందం మాజీ సీఎం నవీన్‌ పట్నాయక్‌కు కలిశారు. జేఏసీ సమావేశానికి హాజరవుతామని నవీన్‌ పట్నాయక్‌ బీజేడీ పార్టీ బుధవారం ప్రకటించింది. బుధవారం ఆంధ్రప్రదేశ్‌కు తమిళనాడు మంత్రి ఏవీ వేలు, రాజ్యసభ సభ్యుడు, సీనియర్‌ న్యాయవాది విల్సన్‌ వెళ్లారు. తాడేపల్లిలో మాజీ సీఎం, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిని కలిశారు. తమిళనాడు సీఎం స్టాలిన్‌ పంపిన ఆహ్వానాన్ని అందజేశారు. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలో జరుగుతున్న అన్యాయం గురించి ఈసందర్భంగా చర్చించుకున్నారు. అనంతరం ఏపీ టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరావును కలిశారు. అలాగే సీనియర్‌ మంత్రి పొన్ముడి, ఎంపీ అబ్దుల్లా కర్ణాటకకు వెళ్లారు. అక్కడి సీఎం సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి శివకుమార్‌లతో వేర్వేరుగా భేటీ అయ్యారు. ఈ ఇద్దరితో కాసేపు సమావేశమయ్యారు. అన్ని వివరాలను వారి దృష్టికి తీసుకెళ్లారు. ఇక పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి. మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌, పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌లను కలిసేందుకు ప్రత్యేక బృందాలు వెళ్లాయి.

మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డితో ఏవీవేలు, విల్సన్‌ భేటీ

సిద్ధరామయ్య, శివకుమార్‌తో పొన్ముడి భేటీ

నవీన్‌ పట్నాయక్‌ గ్రీన్‌సిగ్నల్‌

రాష్ట్రవ్యాప్తంగా నిరసన సభల హోరు

లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో అన్యాయాన్ని నిరసిస్తూ జరగనున్న జాయింట్‌ యాక్షన్‌ కమిటీ సమావేశంలో భాగస్వామ్యం కావాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్‌ మాజీ సీఎం, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డితో డీఎంకే మంత్రి ఏవీ వేలు, ఎంపీ విల్సన్‌ బుధవారం భేటీ అయ్యారు. ఈమేరకు గురువారం ఏపీలోని తాడేపల్లిలో కలిసి ఆహ్వానం పలికారు. అలాగే కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎంలకు కూడా ప్రత్యేక బృందాలు ఆహ్వాన పత్రాలు అందించాయి.

కేంద్రం కుట్రలను ఛేదిస్తాం..

రాష్ట్రానికి కేంద్రం తలబెడుతున్న అన్యాయాన్ని ప్రజలకు వివరించే విధంగా బుధవారం సాయంత్రం రాష్ట్ర వ్యాప్తంగా డీఎంకే నిరసన సభలు జరిగాయి. వేలూరులో సీనియర్‌మంత్రి దురై మురుగన్‌, తిరుచ్చిలో మంత్రి కేఎన్‌ నెహ్రులతో పాటూ ఆయా జిల్లాల మంత్రులు, కార్యదర్శుల నేతృత్వంలో నిరసన సభలు జరిగాయి. హిందీని బలవంతంగా రుద్దేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను, లోక్‌ సభ స్థానాల సంఖ్యను తగ్గించేందుకు జరుగుతున్న కుట్రలను, తమళనాడుకు నిధులను కేటాయించడంలో కేంద్రం చూపుతున్న వైఖరిని ప్రజలకు వివరించే విధంగా నిరసన సభలు జరిగాయి. తిరువళ్లూరులో జరిగిన నిరసన సభలో సీఎం స్టాలిన్‌ ప్రసంగిస్తూ అనాగరికానికి కేరాఫ్‌ అడ్రస్సు మీరే అంటూ కేంద్రంలోని పాలకులపై శివాలెత్తారు. తమిళనాడును సర్వనాశనం చేయడం లక్ష్యంగా, విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేయడమే ధ్యేయంగా ఈ కేంద్రం పాలకులు కుట్రలు పన్నుతున్నారని ధ్వజమెత్తారు. ఇక, ఽకేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు విద్యామంత్రి అన్బిల్‌ మహేశ్‌ లెక్కల పద్దులతో వివరాలను పంపించారు. తమిళనాడులో 1.8 కోట్ల మంది విద్యార్థులు చదువుకుంటున్నారని, ఇందులో సీబీఎస్‌ఈ బడులలో 15 లక్షల మంది వరకు చదువుతున్నారని వివరించారు. మిగిలిన వారంతా ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ సహకారంతో నడిచే పాఠశాలలో స్టేట్‌ సిలబస్‌ను అభ్యసిస్తున్నారని వివరించారు. దీనిని బట్టి తమరే అర్థం చేసుకోవాలని ఇక్కడ ఏ విద్యావిధానం అమల్లో ఉండాలో అన్నది అంటూ హితవు పలికారు. తమిళనాడులో విద్యా వ్యవస్థను సమూలంగా నిర్వీర్యం చేయడానికి కేంద్రం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్టు మంత్రి పళణి వేల్‌ త్యాగరాజన్‌ ధ్వజమెత్తారు. ఇక, డీఎంకే ఆరోపణలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ఖండించారు.

ప్రత్యేక బృందాల ఆహ్వానం1
1/3

ప్రత్యేక బృందాల ఆహ్వానం

ప్రత్యేక బృందాల ఆహ్వానం2
2/3

ప్రత్యేక బృందాల ఆహ్వానం

ప్రత్యేక బృందాల ఆహ్వానం3
3/3

ప్రత్యేక బృందాల ఆహ్వానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement