తిరువళ్లూరు: జిల్లాలోని రైతులకు పంటల బీమాను అందించే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని రాష్ట్ర ప్రభుత్వ అదనపు కార్యదర్శి(స్టాటస్టిక్ విభాగం) జయ అఽధికారులను ఆదేశించారు. తిరువళ్లూరు జిల్లా కోరమంగళం గ్రామంలోని వరి పంటలను అధికారులతో కలిసి పరిశీలించారు. పంట బీమా కోసం నమోదయిన రైతుల వివరాలు, పంటల విస్తీర్ణం, సాగు తదితర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అర్కాడుకుప్పంలోని మహోన్నత పాఠశాలలో సహాయకుడి సాయంతో పరీక్షలు రాస్తున్న విద్యార్దుల డేటా సేకరించి దివ్యాంగుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పూండి యూనియన్ రామంజేరి 11వ వ్యవసాయ స్టాటస్టిక్స్ వివరాల సేకరణ ఫేస్–2, 3తదితర పనులను పరిశీలించి అధికారుల వద్ద సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆమె ప్రసంగిస్తూ, రైతులకు ఇవ్వాల్సిన బీమా విషయంలో నిర్లక్ష్యం వద్దని సూచించారు. పంటల సాగు నమోదు, రైతుల వివరాల నమోదు ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు డైరెక్టర్ భారతి, చైన్నె మండల స్టాటస్టిక్స్ విభాగం జాయింట్ డైరెక్టర్ ఉమారాణి పాల్గొన్నారు.