● బెయిల్ కోరిన మరో నిందితుడు ● నివేదిక ఇవ్వాలని పోలీసులకు హైకోర్టు ఉత్తర్వులు
సేలం : తిరువైన్నెనల్లూర్ సమీపంలో వరద బాధితులను పరామర్శించడానికి వెళ్లిన మంత్రి పొన్ముడిపై బురద చల్లిన బీజేపీ మహిళా నేతను పోలీసులు మంగళవారం రాత్రి అరెస్టు చేశారు. వివరాలు.. విల్లుపురం జిల్లా తిరువైన్నెనల్లూర్‌లో ఫెంగల్ తుపాను కారణంగా తిరువైన్నెనల్లూర్ వంటి 100కుపైగా గ్రామాలు వరద ముంపునకు గురయ్యాయి. ఈ ప్రాంతాలలో బాధితులను పరామర్శించడానికి గత డిసెంబర్ 3వ తేది మంత్రి పొన్ముడి వెళ్లారు. ఆయనతో పాటూ అప్పటి కలెక్టర్ పళని, మాజీ ఎంపీ గౌతమ శిఖామణి తదితరులు కూడా ఉన్నారు. అప్పుడు మంత్రి, అధికారులను ఒక మహిళ దూషించి, వారిపై బురద చల్లి బెదిరించినట్టు, విధులు నిర్వహించనియ్యకుండా అడ్డుకున్నట్టు తిరువైన్నెనల్లూర్ పోలీసు స్టేషన్‌లో ప్రత్యేక సబ్ ఇన్‌స్పెక్టర్ రుల్‌దాస్ ఫిర్యాదు చేశారు. ఆ మేరకు ఇరువేల్‌పట్టు గ్రామానికి చెందిన రామకృష్ణన్, బీజేపీ నేత విజయరాణి అనే ఇద్దరిపై పోలీసులు సహాయక ఇన్‌స్పెక్టర్ బాలసింగం కేసు నమోదు చేసి, వారి కోసం గాలిస్తూ వచ్చారు. గత ఫిబ్రవరి 21వ తేదీన రామకృష్ణన్‌ను ప్రత్యేక బృందం పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో బీజేపీకి చెందిన విజయరాణి మంగళవారం రాత్రి తిరువైన్నెనల్లూర్‌లో పోలీసులు అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.
బెయిల్ పిటిషన్
ఈ కేసులో బెయిల్ కోరుతూ రామకృష్ణన్ దాఖలు చేసిన పిటిషన్‌లో తనపై తప్పుడు కేసు నమోదైనట్టు తెలిపారు. 20 రోజులకు పైగా జైలులో ఉండడం వల్ల బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఈ కేసును విచారించిన న్యాయమూర్తి సుందర్ మోహన్ దీనిపై పోలీసు శాఖ సమాధానం ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసు తదుపరి విచారణను 17 తేదీకి వాయిదా వేశారు.