వేలూరు: వేలూరు కార్పొరేషన్ సమావేశంలో నిధుల కేటాయింపులో అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్‌ల మధ్య వాగ్వాదం జరిగింది. బుధవారం ఉదయం వేలూరు కార్పొరేషన్ సమావేశం మేయర్ సుజాత అధ్యక్షతన జరిగింది. ముందుగా కార్పొరేటర్‌లకు బడ్జెట్‌కు సంబంధించిన పుస్తకాన్ని అందజేశారు. అందులో గత సంవత్సరం కార్పొరేషన్ పరిధిలోని ఒకటవ జోన్‌కు సక్రమంగా కేటాయించక పోవడంతో పాటు నిధులు కేటాయించినట్లు చిత్ర పటాలను ముద్రించారని కార్పొరేటర్‌లు ధ్వజమెత్తారు. దీంతో కమిషనర్ జానికి వీటిపై విచారణ జరిపి న్యాయం చేస్తామన్నారు. అదేవిధంగా కార్పొరేటర్ అన్బు మాట్లాడుతూ కార్పొరేషన్‌లోని 60 వార్డుల్లోను ఆస్తి పన్ను రూ.200 చెల్లించే వారికి కూడా ప్రస్తుతం రూ.4 వేలు వస్తున్నాయని వీటిని నిరుపేదలు కట్టలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పన్నులు చెల్లించకుంటే కార్పొరేషన్ అధికారులు అపరాధం విధిస్తున్నారని ఇదేం న్యాయమన్నారు. వీటిపై విచారణ చేస్తామని కమిషనర్ తెలిపారు. అనంతరం మేయర్ సుజాత 2024–25 సంవత్సరపు బడ్జెట్‌ను దాఖలు చేశారు. ఆ సమయంలో వేలూరు కార్పొరేషన్‌లో పలు కోట్ల రూపాయలకు అభివృద్ధి పనులు జరిగినట్లు అందులో ప్రకటించారని అయితే కాట్పాడి డివిజన్‌కు ఎటువంటి నిధులు కేటాయించకుండా ఎటువంటి అభివృద్ధి పనులు చేయకుండా తమ ప్రాంతంపై శవతి ప్రేమ చూపుతున్నారని అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్‌లు ఆరోపించారు. దీంతో అధికార పార్టీ కార్పొరేటర్‌ల మధ్య మాటల యుద్ధం జరిగింది. వెంటనే ఎమ్మెల్యే కార్తికేయన్ వీటిపై విచారణ జరిపి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో సమావేశం సద్దు మనిగింది. డిప్యూటీ మేయర్ సునీల్‌కుమార్, కార్పొరేషన్ కమిషనర్ జానికి, కార్పొరేటర్లు పాల్గొన్నారు.