కొరుక్కుపేట: సదరన్ రైల్వే ఆధ్వర్యంలో ఫిబ్రవరి 27 నుంచి పక్షం రోజులు పాటూ నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు మంగళవారంతో విజయవంతంగా ముగిశాయి. ముగింపు వేడుకలు మంగళవారం ఉదయం సదరన్ రైల్వే ప్రధాన కార్యాలయంలో నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా సదరన్ రైల్వే మహిళా ప్రధాన కార్యాలయ సంస్థ (ఎస్‌ఆర్‌డబ్ల్యూ హెచ్‌క్యూవో) అధ్యక్షురాలు సోనియాసింగ్ ప్రత్యేక అతిథులుగా ఆ సంస్థ ఉపాధ్యక్షురాలు రేఖ కౌశల్ , సదరన్ రైల్వే ప్రదాన ఆర్థిక సలహాదారు మాలాబికా ఘోష్ హాజరయ్యారు. పక్షం రోజులు పాటూ మహిళా ఉద్యోగులు అనేక ఆకర్షణీయమైన కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. అతిథులు మాట్లాడుతూ మహిళా దినోత్సవం అనే భావన 20 వ శతాబ్దం ప్రారంభంలో కార్మికుల ఉద్యమాలు, మెరుగైన పని పరిస్థితులు, ఓటు హక్కులు, సమాన అవకాశాల కోసం డిమాండ్ల నుంచి ఉద్భవించిందని తెలిపారు. శ్రామిక శక్తిలో మహిళల అమూల్యమైన సహకారాన్ని గుర్తిస్తూ భారతీయ రైల్వేలు అనేక సంవత్సరాలుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని చురుకుగా పాటిస్తోందని తెలిపారు.