తిరువొత్తియూరు: విరుదాచలం సమీపంలో రైలు లో ప్రయాణిస్తూ ప్రమాదవశాత్తు జారిపడి ఓ ప్ర యాణికుడు మృతి చెందిన సంఘటన విషాదం నింపింది. వివరాల్లోకి వెళితే.. చైన్నె నుంచి తూత్తుకుడి వరకూ వెళ్లే ముత్తునగర్ ఎక్స్‌ప్రెస్ రైలు ఆదివారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో కడలూరు జిల్లా విరుదాచలం రైల్వేస్టేషన్‌లో ఆగింది. ప్రయాణికులు దిగిన తర్వాత రైలు బయలుదేరి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో వెళుతున్న సమయంలో అన్ రిజర్‌డ్వ్ బోగీలో నిలబడి ఉన్న ఒక ప్రయాణికుడు హఠాత్తుగా కాలుజారి కింద పడ్డాడు. ఇది చూసిన తోటి ప్రయాణికులు శబ్దం చేసి, రైలు గార్డ్ కు సమాచారం తెలిపారు. దీంతో గార్డు విరుదాచ లం రైల్వే పోలీస్ స్టేషన్ పోలీసులకు సమాచారం అందించాడు. రాత్రి కావడంతో విరుదాచలం రైల్వే పోలీసులు అక్కడి చేరుకుని ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. కానీ అక్కడ కింద పడిన వ్యక్తి కనిపించలేదు. ఈ క్రమంలో సోమవారం ఉద యం రైల్వే పోలీసులు అదే ప్రాంతానికి వెళ్లి తనిఖీ చేయగా అక్కడ సాత్తుకూడల్ రైల్వే వంతెన కింద ఉన్న ఒక వాడ ప్రాంతంలో బండరాయి మధ్య తీవ్ర గాయాలతో వ్యక్తి శవం ఉండగా గుర్తించారు. మృతదేహాన్ని విరుదాచలం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అతని ప్యాంటు జేబులో ఉన్న ఆధార్‌కార్డు ఆధారంగా అతను అరియ లూరుకు చెందిన సతీష్ కుమార్ (35) అని తెలిసింది. అతని బంధువులకు సమాచారం తెలిపారు. ఈ మేరకు విరుదాచలం రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.