
ఆహా.. ఇది కదా భాగ్యము.. శ్రీహరిని స్పృశించిన మలయ మారుతం మము తాకగా.. సుదర్శనుని అభిషేకించిన పవిత్ర తీర్థంలో పుణ్యస్నానమాచరింపగా.. ఉభయ దేవేరీ సమేతంగా కొలువుదీరిన మలయప్పస్వామిని సేవింపంగా.. మా జన్మ చరితార్థమైందని భక్తజనులు పరవశించారు. సుమనోహర విశేష సుమ మాలలు ధరించిన దేవదేవేరులను వీక్షించి పునీతులయ్యారు. బ్రహ్మోత్సవాలను పరిపూర్ణం చేస్తూ నిర్వహించిన ధ్వజావరోహణ ఘట్టంలో పాలుపంచుకుని పులకించారు.
తిరుమల : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన మంగళవారం ఉదయం చక్రస్నానం కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. విశేష సంఖ్యలో భక్తులు విచ్చేసి శ్రీవారి పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు. అంతకుముందు తెల్లవారుజామున 3 నుంచి 6 గంటల వరకు స్వామివారికి పల్లకీ ఉత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ఉదయం 6 నుంచి 9 గంటల మధ్య శ్రీ భూవరాహస్వామి ఆలయ ముఖమండపంలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామివారికి, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్నపనతిరుమంజనం జరిపించారు. విశేష అభిషేకాలనంతరం వివిధ పాశురాలను పెద్ద జీయ్యంగార్, చిన్న జీయ్యంగార్లు పఠించారు. ఈ వేడుకలో ఒక్కో క్రతువులో ఒక్కో రకమైన ఉత్తమ జాతి పుష్ప మాలలను స్వామి, అమ్మవార్లకు అలంకరించారు. సాయంత్రం ధ్వజావరోహణ కార్యక్రమాన్ని యథావిధిగా నిర్వహించారు. దీంతో బ్రహ్మోత్సవాలు పరిపూర్ణమైనట్టు టీటీడీ అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమాలలో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఈఓ ఏవీ.ధర్మారెడ్డి దంపతులు, కలెక్టర్ కే.వెంకటరమణారెడ్డి, జేఈఈఓలు సదాభార్గవి, వీరబ్రహ్మం, ఎస్పీ పరమేశ్వర రెడ్డి, సీవీఎస్వో నరసింహకిషోర్ తదితరులు పాల్గొన్నారు.



