
మెట్రో రైలు
సాక్షి, చైన్నె : సిరుచ్చేరి – కిలాంబాక్కం మెట్రో విస్తరణ పనులకు బ్రేక్ పడింది. ప్రస్తుతం ఈ మార్గంలో ప్రయాణికుల సంఖ్య తక్కువే కావడంతో ఈ పనులను నిలుపుదల చేసే విధంగా సాధ్యాసాధ్యాల పరిశీలన కమిటీ నివేదికను సమర్పించింది. చైన్నెలో రెండు మార్గాల్లో మెట్రో రైలు సేవలు జరుగుతున్నాయి. మరో మూడు మార్గాల్లో పనులు చేపడుతున్నారు. ఇందులో మాధవరం – సిరుచ్చేరి మార్గంలో కేలంబాక్కం మీదుగా కొత్తగా రూపుదిద్దుకుంటున్న కిలాంబాక్కం బస్ టెర్మినల్‌కు మెట్రో విస్తరణ పనులకు నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన సాధ్యాసాధ్యాల నివేదికను సిద్ధం చేశారు.ఈ నివేదికను మెట్రో ప్రాజెక్టు ఎండీ సిద్ధిక్ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి రమేష్ చంద్‌కు ఈ నివేదిక సమర్పించారు. ఇందులో సిరుచ్చేరి నుంచి కేలంబాక్కం మీదుగా కిలాంబాక్కం వరకు 23.5 కి.మీ దూరం 12 రైల్వే స్టేషన్లతో నిర్మాణాలకు రూ. 5,458 కోట్లు అంచనా వ్యయంగా నిర్ణయించామని వివరించారు. అయితే ఈమార్గంలో ప్రసుత్తం అభివృద్ధి అంతంత మాత్రమేనని, ప్రయాణికుల సంఖ్య తక్కువగానే ఉంటుందని పేర్కొంటూ.. ప్రస్తుతానికి ఈ మార్గం పనులకు బ్రేక్ వేస్తూ పేర్కొనడం గమనార్హం.
ఆవడికి ఓకే..
కోయంబేడు నుంచి తిరుమంగళం – మొగ పేర్ మీదుగా ఆవడికి 16.7 కి.మీ దూరం విస్తరణ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే విధంగా నివేదిక సిద్ధం చేశారు. ఈ మార్గంలో 15 రైల్వే స్టేషన్లలతో రూ. 6,376 కోట్ల అంచనా వ్యయంతో పనులకు సాధ్య నివేదిక సమర్పించారు. అలాగే ఆవడికి కూత వేటు దూరంలో పట్టాభిరాం పరిసరాల్లో చేపడుతున్న అభివృద్ధిని పరిగణించి, అక్కడి వరకు పనులకు చేపట్టేందుకు వీలుగా నివేదిక రూపొందించి ఉండడం విశేషం.