
కావేరి నది
● కావేరి జలాల వ్యవహారంలో తేల్చిచెప్పిన సుప్రీంకోర్టు ● 5 వేల క్యూసెక్కుల నీటి విడుదలకు ఆదేశాలు
సాక్షి, చైన్నె: కావేరి యాజమాన్య సంస్థ, కావేరి జలాల పర్యవేక్షణ కమిటీ ఉత్తర్వుల వ్యవహారంలో జోక్యం చేసుకోబోమని సుప్రీం కోర్టు స్పష్టంచేసింది. తమిళనాడు, కర్ణాటకలు దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్లను గురువారం తిరస్కరించింది. అయితే ఈ రెండు సంస్థల ఉత్తర్వుల మేరకు తమిళనాడుకు సెకనుకు 5 వేల క్యూ సెక్కుల నీటిని విడుదల చేసే విధంగా కోర్టు ఆదేశాలు ఇచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వ తరపు న్యాయవాది విల్సన్ తెలిపారు. వివరాలు.. తమిళనాడు – కర్ణాటక మధ్య కావేరి జలాల విడుదల వివాదం ఈ ఏడాది జఠిలంగా మారిన విషయం తెలిసిందే. కావేరి యాజమాన్య సంస్థ, కావేరి నది జలాల పర్యవేక్షణ కమిటీ ఇచ్చిన ఉత్తర్వులను కర్ణాటక భేఖాతరు చేసింది. దీంతో సుప్రీంకోర్టును రాష్ట్ర ప్రభుత్వం ఆశ్రయించింది. అదే సమయంలో కర్ణాటక సైతం పిటిషన్ వేసింది. ఈ రెండు పిటిషన్లు గురువారం సుప్రీం కోర్టులో విచారణకు వచ్చాయి. వాదనల సమయంలో తమిళనాడుకు 2,500 క్యూ సెక్కుల నీటిని విడుదల చేస్తామని కర్ణాటక కోర్టు ముందు కొత్త ప్రతిపాదనను ఉంచింది. యాజమాన్య సంస్థ, కమిటీ ఇచ్చిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా నీటి శాతం తగ్గిస్తామని కర్ణాటక పేర్కొనడాన్ని కోర్టు ఏకీభవించ లేదు. చివరకు ఈ వ్యవహారంలో యాజమాన్య సంస్థ, కమిటీ ఇచ్చిన ఉత్తర్వులలో జోక్యంచేసుకోబోమని పేర్కొంటూ, పిటిషన్లను న్యాయమూర్తులు తిరస్కరించారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వ తరపు న్యాయవాది విల్సన్ మీడియాతో మాట్లాడుతూ, కర్ణాటక నీటి తగ్గింపు వాదనను ప్రస్తావించడాన్ని కోర్టు ఏకీ భవించ లేదని, తమిళనాడుకు 5 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాల్సిందేనని ఆదేశాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా కావేరి వ్యవహారంలో కర్ణాటకతో చర్చలకు అవకాశం లేదని నీటి పారుదల శాఖ మంత్రి దురై మురుగన్ స్పష్టం చేశారు.