
పన్నీరు, పళణి (ఫైల్)
సాక్షి, చైన్నె: మాజీ సీఎం పన్నీరు సెల్వానికి వ్యతిరేకంగా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి గురువారం మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అన్నాడీఎంకే పూర్తిగా పళణి స్వామి గుప్పెట్లోకి చేరిన విషయం తెలిసిందే. పన్నీరు సెల్వం అండ్ బృందాన్ని ఆపార్టీనుంచి బయటకు పంపించేశారు. అయినా, తమ పార్టీ పేరును, జెండాను, చిహ్నం, లేటర్ ప్యాడ్‌ను పన్నీరు సెల్వం ఉపయోగిస్తున్నారని, ఇందుకు చెక్ పెట్టే విధంగా ఉత్తర్వులుజారీ చేయాలని కోరుతూ పళణిస్వామి కోర్టు తలుపు తట్టారు. తమ పార్టీ పేరు, జెండా, చిహ్నం, లెటర్ ప్యాడ్‌ను ఆయన ఉపయోగించేందుకు వీలు లేదని, పార్టీకి సంబంధించి అన్నిరకాల అనుమతులు కోర్టుల ద్వారా తాను దక్కించుకున్నట్టు పిటిషన్‌లో వివరించారు. వాదనల అనంతరం ఈ పిటిషన్‌కు వివరణ ఇవ్వాలని పన్నీరు సెల్వంకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను అక్టోబరు 6వ తేదీకి న్యాయమూర్తి వాయిదా వేశారు. ఇదిలా ఉండగా పళణి స్వామికి కొడనాడు కేసును అంటకట్టే విధంగా ఇటీవల కాలంగా క్రీడల శాఖ మంత్రి ఉదయ నిధి స్టాలిన్ ఆరోపణలు, వ్యాఖ్యల తూటాలను పేల్చుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో తన పేరును వాడటం, తనపై ఆరోపణలు చేయకుండా ఉదయ నిధికి స్టే విధించాలని పళణి స్వామి కోర్టును ఆదేశించారు. ఇందుకు స్పందించిన కోర్టు స్టే విధించింది.
కోవై జైలులో ఖైదీలు,
వార్డెన్ల మధ్య ఘర్షణ
● 11 మందికి గాయాలు
తిరువొత్తియూరు: కోయంబత్తూరు సెంట్రల్ జైలులో 2,500 మందికి పైగా రిమాండ్ ఖైదీలున్నారు. గురువారం ఉదయం జైలులో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు వార్డెన్లు ఖైదీలను ఉంచే (వాల్మేడు) బ్లాక్‌లో గస్తీ తిరుగుతున్నారు. ప్రతి గదికి వెళ్లి పరిశీలించారు. ఆ సమయంలో ఓ గదిలోని ముగ్గురు వ్యక్తులు ఎప్పుడంటే అప్పుడు తమ వద్దకు వచ్చి తనిఖీలు చేయటం ఎందుకని ప్రశ్నించడంతో గార్డు, ఖైదీల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. చివరికి ఘర్షణగా మారింది. వారి శబ్దం విని తోటి వార్డెన్లు అక్కడికి వెళ్లారు. ఖైదీలు కూడా పెద్ద సంఖ్యలో గుమిగూడారు. ఖైదీలు అందరూ కలిసి వార్డెన్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇరువర్గాలు వాగ్వాదానికి దిగి పరస్పరం దాడి చేసుకున్నాయి. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. కొందరు ఖైదీలు చెట్లు ఎక్కి ఇలా ఇబ్బంది పెడితే చేతులు నరికివేస్తామని బెదిరించారు. మరికొందరు ఖైదీలు వార్డెన్లలపై దాడి చేశారు. ఈ ఘర్షణలో మోహన్ రాజ్, బాబు జాన్, విమల్‌రాజ్, రాహుల్ అనే నలుగురు వార్డెన్లు, ఏడుగురు ఖైదీలు గాయపడ్డారు. అధికారులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనపై జైళ్లశాఖ డి.ఐ.జి షణ్ముగసుందరం దర్యాప్తు చేస్తున్నారు.
వివాహిత బలవన్మరణం
అన్నానగర్: తిరుపూర్ సెట్టిపాలైయం సమీపం ప్రియాంక నగర్‌కు చెందిన సురేష్ (35)భార్య సొర్ణకళ (33). దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి ఆమె తన తండ్రికి ఇంట్లో సమస్యలను తెలియజేస్తూ వీడియోను పంపి తర్వాత విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈమేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా వీడియోలో తనపై అనుమానంతో భర్త వేధించడంతోనే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు బాధితురాలు చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు.
విజేతలకు
బహుమతుల ప్రదానం
కొరుక్కుపేట: దేశంలోనే తొలిసారిగా నిర్వహించిన సికా కలినరీ ఛాలెంజ్ అండ్ ఎగ్జిబిషన్‌లో తమదైన ప్రతిభను చాటుకున్నవారికి బహుమతులను ప్రదానం చేశారు. సౌత్ ఇండియా చెఫ్ అసోసియేషన్ (సికా) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీలో 1,500 మందికి పైగా చెఫ్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆచ్చి మసాలా వ్యవస్థాపకురాలు పద్మాసింగ్ ఐజాక్, సికా అధ్యక్షుడు చెఫ్ దాము, ప్రధాన కార్యదర్శి చెఫ్ శీతారామ్ ప్రసాద్ విజేతలకు ట్రోఫీలను అందజేశారు. ఇందులో జీఆర్‌టీ గ్రాండ్ విజేతగా నిలిచి డాక్టర్ చెఫ్ సౌందర్ రాజన్ మెమోరియల్ ట్రోఫీని కై వసం చేసుకున్నారు.

ట్రోఫీలను అందజేస్తున్న నిర్వాహకులు