
డాక్టర్లతో యువకుడు
సాక్షి, చైన్నె : మెదడులో రెండు మిర్రర్ ఇమేజ్ ట్యూమర్లతో బాధ పడుతున్న 38 ఏళ్ల యువకుడికి చైన్నె గ్లెనెగల్స్ గ్లోబల్ హెల్త్ సిటీ వర్గాలు అరుదైన శస్త్ర చికిత్సను నిర్వహించారు. గురువారం స్థానికంగా జరిగిన సమావేశంలో ఆ హెల్త్ సిటీ డాక్టర్ నిగెల్ పి సిమ్స్ మీడియాకు శస్త్ర చికిత్స గురించి వివరించారు. చైన్నెకు చెందిన ఈ యువకుడు తీవ్ర తలనొప్పితో ఆస్పత్రికి వచ్చినట్టు , పరిశోధించగా అతడి మెదడులో ఎడమ , కుడి భాగాలలో రెండు చోట్ల మిర్రర్ ఇమేజ్ పద్ధతిలో రెండు కణితులు ఉండటాన్ని గుర్తించామన్నారు. పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారకుండా 10 గంటలకు పైగా శ్రమించి శస్త్ర చికిత్సను చేశామన్నారు. ఒక్కో కణితి 5 ఇన్‌టూ 7 సె.మీ ఉండటంతో ఇదో అరుదైన సంఘటనగా గుర్తించామన్నారు. డాక్టర్ దినేష్ నాయక్ మాట్లాడుతూ, దేశంలో లక్ష మందిలో ఐదు నుంచి పది మందిలో బ్రెయిన్ ట్యూమర్ సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు. మెదడులో కణితి ఉన్న పక్షంలో తీవ్ర తలనొప్పి, వాంతులు, బలహీనత, పక్షవాతం, చూపు మందగించడం, వినికిడి సమ స్య, జ్ఞాపక శక్తి తగ్గడం వంటి మార్పులు వస్తాయని, తక్షణం వైద్యులను సంప్రదించి చికిత్స చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆ హెల్త్ సిటీ సీఈఓ డాక్టర్ అలోక్ ఖుల్లర్, మార్కెటింగ్ హెడ్ భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.