
పౌష్టికాహారం అందజేస్తున్న జ్ఞానమణి
పౌష్టికాహారంపై అవగాహన
పళ్లిపట్టు: ఆర్కేపేటలో గురువారం పౌష్టికాహార వారోత్సవాలు నిర్వహించారు. చిన్నారుల తల్లులకు పౌష్టికాహారంపై అవగాహన కల్పించారు. ఆల్ ది చిల్డ్రన్ ట్రస్టు ద్వారా చిన్నారులకు పౌష్టికాహార వారోత్సవాలు దిగువ బాలాపురంలో నిర్వహించారు. ఇందులో యూనియన్ చిల్డ్రన్ డెవలప్‌మెంట్ అధికారి జ్ఞానమణి పాల్గొని చిన్నారులకు అవగాహన కల్పించారు. ఆల్ ది చిల్డ్రన్ ట్రస్టు కో–ఆర్డినేటర్ రజినీ పాల్గొన్నారు.
కూలీకి యావజ్జీవ శిక్ష
అన్నానగర్: మహిళ హత్య కేసులో కృష్ణగిరి కోర్టు ఓ కూలీకి గురువారం యావజ్జీవ శిక్ష విధించింది. కృష్ణ్ణగిరి సమీపంలోని కనకముట్లకు చెందిన లక్ష్మి(40) భర్త నుంచి విడిపోయి 16 ఏళ్లుగా ఒంటరిగా జీవిస్తోంది. ఇతని బంధువు దురై (50). వీరిద్దరూ మేకల కాపరులు. జూన్ 8, 2022న వారు పెరియ కల్కుండు హిల్స్‌లో మేకలు మేపుతుండగా పర్కూరు నక్కల్‌పట్టి ఇరులార్ కాలనీకి చెందిన కూలీ తిమ్మరాజ్(36) లక్ష్మిని లైంగికంగా వేధించి హత్య చేశాడు. ఈ కేసుపై న్యాయమూర్తి సుధ గురువారం తీర్పు వెలువరించారు. నేరం రుజువు కావడంతో తిమ్మరాజుకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చారు.
ఎనిమిది నెలల్లో
412 మంది నిందితుల అరెస్ట్
కొరుక్కుపేట: చైన్నెలో గత ఎనిమిది నెలల్లో హత్యలు, చోరీలు, దోపిడీలకు పాల్పడిన 412 మందిని గ్యాంగ్‌స్టర్ చట్టం కింద నగర పోలీసులు అరెస్టు చేశారు. చైన్నె పోలీసు పరిధిలో చట్టాన్ని అతిక్రమిస్తున్న వ్యక్తులను అరెస్టు చేసి చర్యలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్ సందీప్ రాయ్ రాథోడ్ ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు 12 పోలీసు జిల్లాల్లో డిప్యూటీ కమిషనర్ల ఆధ్వర్యంలో అసిస్టెంట్ కమిషనర్ల అరెస్టులు, చర్యలు తీసుకుంటున్నారు. ప్రజాశాంతికి విఘాతం కలిగించే నేరాలకు పాల్పడిన 279 మంది రైడర్లు, దొంగతనాలు, దోపిడీలు, మనీలాండరింగ్ నేరాలకు పాల్పడిన 71 మందిని, గంజాయి, మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్న 49 మందిని గూండా నిరోధక చట్టం కింద అరెస్టు చేసి జైలుకు పంపారు. ఇందులో ముఖ్యంగా మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న ఆదంబాక్కం అంబేడ్కర్ నగర్‌కు చెందిన లోకేష్ (22)ని అరెస్ట్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు.
రౌడీపై కత్తులతో దాడి
తిరువొత్తియూరు: ఎర్నావూరు నేతాజీ నగర్‌కు చెందిన సూర్య (22) రౌడీ. ఇతనిపై పలు కేసులు ఉన్నాయి. ఈక్రమంలో బుధవారం రాత్రి సూర్య కాశిమేడు చేపలపట్టు హార్బర్ వద్ద చేపలు వేలం వేసేందుకు వచ్చాడు. ఆ సమయంలో అతన్ని వెంబడిస్తూ వచ్చిన ఏడుగురు అతనిపై కత్తులతో దాడి చేసి పారిపోయారు. అక్కడున్న జాలర్లు కాశిమేడు హార్బర్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడకు చేరుకుని తీవ్రంగా గాయపడ్డ సూర్యను స్టాన్టీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
50 సవర్ల బంగారు
నగలు స్వాధీనం
● బ్యాంక్ ఉద్యోగి అరెస్ట్
వేలూరు: బంగారు నగలను చోరీ చేసిన బ్యాంకు ఉద్యోగిని పోలీసులు అరెస్ట్ చేశారు. వేలూరు తొర్రపాడి సమీపంలోని రామ్‌శెట్టినగర్‌కు చెందిన బాలాజీ ఐటీ ఉద్యోగి, భార్య మోహనప్రియ ప్రభుత్వ పాఠశాలలో టీచర్. బాలాజీ తల్లి, భార్య, పిల్లలతో కలిసి మిద్దైపెన జీవిస్తున్నాడు. ఈ నేపథ్యంలో బాలాజీ కుటుంబసభ్యులతో కలిసి ఈనెల 3న తిరువణ్ణామలైకు వెళ్లి తిరిగి సాయంత్రం ఇంటికి వచ్చారు. అయితే ఇంటి వెనుక తలుపులు తెరిచి ఉండడంతో దిగ్భ్రాంతి చెంది లోపలికి వెళ్లి చూడగా బీరువాలో ఉంచిన 50 సవర్ల బంగారు నగలు చోరీకి గురైనట్లు గుర్తించారు. ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా బాలాజీ పక్కింట్లో నివసిస్తున్న బంధువు బ్యాంకు ఉద్యోగి వెంకటేష్ ఇంటికి వచ్చి వెళ్లినట్లు తెలిసింది. దీంతో అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా నగలను చోరీ చేసి తిరువణ్ణామలైలోని ప్రైవేటు బ్యాంకులోని లాకర్‌లో ఉంచినట్లు నేరం అంగీకరించాడు. పోలీసులు నగలను స్వాధీనం చేసుకొని నిందితుడు వెంకటేశన్‌ను అరెస్ట్ చేశారు.
తమిళనాడు భాషా
మైనారిటీలకు ఘన విజయం
కొరుక్కుపేట: తమిళనాడు పాఠశాలల్లో మాతృభాషను నేర్చుకునే మన రాజ్యాంగ హక్కును సమర్థిస్తూ గురువారం చారిత్రాత్మక తీర్పునిచ్చిన భారత సుప్రీంకోర్టు, న్యాయమూర్తి, మాజీ ప్రధాన న్యాయమూర్తి, మద్రాసు హైకోర్టు (2014–17) న్యాయమూర్తి సంజయ్ కిషన్‌కౌల్‌కు తమిళనాడు భాషాపరమైన మైనారిటీల ఫోరమ్ (లింఫాట్) కృతజ్ఞతలు తెలిపింది. యాదృచ్ఛికంగా, ఆయన మద్రాసు హైకోర్టు (2016)లో మన మాతృభాషకు మొదటి ఉపశమనాన్ని అందించారు. ప్రస్తుతం (2023) సుప్రీంకోర్టు తీర్పు ద్వారా శాశ్వత రక్షణ కల్పించారు. ఉత్తర్వులలో ఇలా పేర్కొన్నారు. తమిళనాడు పాఠశాలల్లోని ఏ విద్యార్థి అయినా, తమిళం కాకుండా ఇతర భాషలను అభ్యసించడాన్ని ఎంచుకుంటే, ఉత్తీర్ణత కోసం నిర్దేశించిన కనీస మార్కులు మార్క్‌షీట్‌లో కనిపించే మార్కులతో ఆ భాషను అభ్యసించడానికి అనుమతించబడతారని పేర్కొంది. దీంతో భారత సర్వోన్నత న్యాయస్థానానికి లింఫాట్ చైర్మన్ ప్రొఫెసర్ సీఎంకే రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.