
ఆచార్య రామచంద్ర జయంతి వేడుకల్లో నిర్వాహకులు
కొరుక్కుపేట: తెలంగాణ, పుదుచ్చేరి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పుట్టినరోజు సందర్భంగా ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ ట్విట్టర్‌లో శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటనలో ఆయన పేర్కొంటూ తన సోదరి తమిళిసై సౌందరరాజన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మరెన్నో పదవులను ఆమె అలంకరించాలని ఆకాంక్షిస్తున్నట్టు సీఎం స్టాలిన్ పోస్ట్ చేశారు.
సామాజిక మాధ్యమంలో వార్
● టీఆర్‌బీ వర్సెస్ అన్నామలై
సాక్షి, చైన్నె: మంత్రి టీఆర్‌బీ రాజా, బీజేపీ అధ్యక్షుడు అన్నామలై మధ్య శుక్రవారం సామాజిక మాధ్యమాల వేదికగా వ్యాఖ్యల వార్ సాగింది. ఈ ఇద్దరు తీవ్రస్థాయిలో విమర్శలు, ఆరోపణలు చేసుకున్నారు. అముల్ పాల రూపంలో రాష్ట్ర ప్రభుత్వ రంగం సంస్థ ఆవిన్‌కు సమస్యలు ఎదురవుతున్న విషయం తెలిసిందే. అముల్ చర్యలకు బ్రేక్ వేయాలని కోరుతూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు సీఎం స్టాలిన్ లేఖ రాశారు. ఏ శాఖకు, ఏ మంత్రులకు లేఖలు రాయాలో తెలియని పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందని అన్నామలై విమర్శించారు. ఇందుకు పరిశ్రమల మంత్రి టీఆర్‌బీ రాజా కౌంటర్ ఇస్తూ అన్నామలైపై విరుచుకుపడ్డారు. ఇప్పటి వరకు ఇచ్చిన 20 వేల పుస్తకాలు చాలన్నట్టుందని హితవు పలికారు. ఇన్ని పుస్తకాలు చదవడం కాదని, భారత రాజ్యంగం నుంచి అన్నామలై చదవడం మొదలెట్టాలని హితవు పలికారు. అముల్ పాల వ్యవహారం సహకార శాఖ పరిధిలోకి వస్తుందని, ఆ శాఖ అమిత్‌షా చేతిలో ఉండబట్టే ఆయనకు లేఖ రాసినట్టు సూచించారు. బీజేపీ పాలకలను, కేంద్రమంత్రులను సంకటంలో పడేసే విధంగా అన్నా మలై చర్యలు ఉన్నాయని విరుచుకుపడ్డారు. ఇందుకు ఎదురు దాడి చేస్తూ అన్నామలై తీవ్రంగానే స్పందించారు. తండ్రి వారసత్వంలో రాజకీయాల్లోకి, పదవులోకి వచ్చిన వాళ్లు ముందుగా కేంద్ర వ్యవహారాల గురించి నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పాల వ్యవహారం పాడి పరిశ్రమల చేతిలో ఉందని ఇది కూడా తెలియక పరిశ్రమల మంత్రిగా టీఆర్‌బీ రాజా ఉన్నారని వ్యాఖ్యలు చేశారు. ఈ ఇద్దరి మధ్య వాడీవేడిగా సామాజిక మాధ్యమాల వేదికగా వార్ జరగడంతో ఆసక్తిగా వాటిని చూసిన వాళ్లే ఎక్కువ.
ఘనంగా వైకాశి విశాఖ ఉత్సవాలు
తిరువొత్తియూరు: తిరుచెందూరు సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో వైకాశి విశాఖ ఉత్సవాలు శుక్రవారం వైభవంగా జరిగాయి. అరుపడై వీడుగల్‌లో 2వ వీడు తిరుచెందూర్ సుబ్రహ్యణ్యస్వామి ఆలయంలో మురుగప్పెరుమాన్ జన్మనక్షత్రమైన వైకాశి విశాఖ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఉత్సవాల్లో 10వ రోజైన శుక్రవారం వైకాశి విశాఖ పర్వదినాన్ని పురస్కరించుకుని తెల్లవారుజామున 1 గంటకు ఆలయాన్ని తెరిచి, 1.30 గంటలకు విశ్వరూప దర్శనం, 3 గంటలకు ఉదయ మార్తాండ సేవ, అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామివారు జయంతినాథ ఆలయం నుంచి బంగారు చప్పరం లేచి వసంత మండపానికి చేరారు. అక్కడ సాయంత్రం సుబ్రహ్మణ్యస్వామిని వసంత మండపం చుట్టూ 11 సార్లు ఉత్సవమూర్తులను ఊరేగించి ఆలయానికి తీసుకొచ్చారు. రాత్రి 7.15 గంటలకు రాత్రికాల అభిషేకం చేశారు.
విరామంలేని వ్యక్తి ఆచార్య రామచంద్ర
కొరుక్కుపేట: మద్రాసు విశ్వవిద్యాలయం, తెలుగుశాఖ ఆధ్వర్యంలో సాహితీవేత్తల జయంత్యుత్సవాల సందర్భాన్ని పురష్కరించుకుని ‘సాహిత్యకారుల జీవనచిత్రాలు’లలో భాగంగా శుక్రవారం రమ్య కవితా సుధాచంద్ర ఆచార్య వి.రామచంద్ర జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి తెలుగుశాఖ అతిథి ఉపన్యాసకులు డా. పాండురంగం కాళియప్ప, శాఖాధిపతి ఆచార్య విస్తాలి శంకరరావు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ 100 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్న తెలుగుశాఖ వికాసంలో రామచంద్ర పాత్ర కీలకమైందిగా పేర్కొన్నారు. జనని అధ్యక్షులు డా.నిర్మల మాట్లాడుతూ రామచంద్రకు మొదటి విద్యార్థినైనందుకు ఎంతో సంతోషంగా ఉందని తెలియజేస్తూ, వారి విద్యార్థి కాలంనాటి విశేషాలను, రామచంద్ర అందించిన సహాయసహకారాలను తెలియజేశారు. ప్రముఖ కవి, విమర్శకులు డా. కాసల నాగభూషణం, డా. మాడా శంకరబాబు, రామచంద్ర సతీమణి సుగుణ, డా.శివకుమారి, ఆచార్య ఎల్‌బీ శంకరరావు దంపతులు, గుడిమెట్ల చెన్నయ్య, రాజధాని కళాశాల అధ్యాపకులు ధనుంజయ, శారదమ్మ పాల్గొన్నారు.