సన్నద్ధం

లోగో  ఆవిష్కరిస్తున్న గోపాలకృష్ణ గాంధీ, సీఎం స్టాలిన్‌, మంత్రులు ఉదయనిధి, దురైమురుగన్‌   - Sakshi

కరుణ శత జయంతికి
● నేటి నుంచి ఏడాది పొడవునా వేడుకలు ●శతాబ్ది ఉత్సవ లోగోను ఆవిష్కరించిన స్టాలిన్‌ ●ఫొటో ఎగ్జిబిషన్‌ ఏర్పాటు ●చైన్నెలో కలైంజర్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ ●నేడు బహిరంగ సభ...వేడుకలు

సాక్షి, చైన్నె: దివంగత డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎం కరుణానిధి శత జయంతి ఉత్సవాలకు ప్రభుత్వం సన్నద్ధమైంది. శనివారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఏడాది పొడవునా వేడుకలకు ఏర్పాట్లు చేశారు. ఇందులోభాగంగా శుక్రవారం శతాబ్ది ఉత్సవాల లోగోను సీఎం ఎంకే స్టాలిన్‌ చైన్నెలో ఆవిష్కరించారు. కలైవానర్‌ అరంగం వేదికగా కలైంజ్ఞర్‌ జీవిత చరిత్రను చాటే విధంగా ఫొటో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు.

ద్రవిడ సిద్ధాంతకర్త పెరియార్‌కు శిష్యుడిగా, ద్రవిడ పార్టీల ఆవిర్భావ కర్త అన్నాదురైకు తమ్ముడిగా తమిళ రాజకీయల్లోనే కాదు దేశ రాజకీయాల్లోనూ చక్రం తిప్పిన నాయకుడు కరుణానిధి. ఓటమి ఎరుగని యోధుడిగా తమిళ ప్రజల కోసం అవిశ్రాంతంగా శ్రమించిన కరుణానిధి మెరీనా తీరంలో శాశ్వత నిద్రలో ఉన్నారు. అన్నాదురై సమాధి పక్కనే శాశ్వత నిద్రలో ఉన్న కరుణానిధికి బ్రహ్మాండ స్మారకం నిర్మాణ పనులపై డీఎంకే ప్రభుత్వం దృష్టిపెట్టింది. అలాగే, 2023 జూన్‌ 3 నుంచి 2024 జూన్‌ 3వ తేదీ వరకు ఏడాది పొడవునా కరుణ శత జయంతి ఉత్సవాల నిర్వహణకు సిద్ధమైంది. ప్రభుత్వం నేతృత్వంలో అధికారిక వేడుకగా, మరోవైపు పార్టీ వేడుకగా ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా శనివారం జయంతి కార్యక్రమాలు మిన్నంటనున్నాయి. సాయంత్రం ఉత్తర చైన్నె పరిధిలోని బిన్ని మిల్‌ మైదానంలో బ్రహ్మాండ బహిరంగ సభగా వేడుక జరగనుంది.

లోగో ఆవిష్కరణ..

కరుణానిధి శత జయంతి ఉత్సవాల కోసం ప్రత్యేక చిహ్నం రూపొందించారు. అలాగే, కరుణ జీవిత విశేషాలను చాటే విధంగా బ్రహ్మాండ ఫొటో ఎగ్జిబిషన్‌ను కలైవానర్‌ అరంగంలో ఏర్పాటు చేశారు. గాంధీ మనవడు గోపాలకృష్ణ గాంధీ అధ్యక్షతన జరిగిన వేడుకలో కలైంజ్ఞర్‌ శతాబ్ది ఉత్సవ లోగోను సీఎం స్టాలిన్‌ విడుదల చేశారు. తమిళనాడు ప్రజల సంక్షేమం కోసం అవిశ్రాంతంగా కరుణ అందించిన సేవలను, సీఎంగా ఆయన హయాంలో అమల్లోకి వచ్చిన పథకాలు, ప్రాజెక్టుల వివరాలను తెలియజేస్తూ లఘు చిత్రాన్ని విడుదల చేశారు. మంత్రులు దురైమురుగన్‌, ఉదయనిధి, ఎం సుబ్రమణియన్‌, స్వామినాథన్‌, కేఎన్‌ నెహ్రూ, పీకే శేఖర్‌బాబు, సీఎస్‌ ఇరైఅన్భు పాల్గొన్నారు.

న్యూస్‌రీల్‌

25 ఎకరాల్లో కన్వెన్షన్‌ సెంటర్‌..

సీఎం స్టాలిన్‌ మాట్లాడుతూ కరుణానిధి సేవలను స్మరిస్తూ వ్యాఖ్యలు చేశారు. కలైంజ్ఞర్‌ పేరిట చైన్నెలో అంర్జాతీయ ప్రమాణాలతో బ్రహ్మాండ వేదికగా కన్వెన్షన్‌ సెంటర్‌ ఏర్పాటు చేయబోతున్నామని ప్రకటించారు. 25 ఎకరాల విస్తీర్ణంలో 5 వేల మంది కూర్చునేందుకు వీలుగా ఆడిటోరియం, సదస్సులు, సమావేశాలు నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు, ఎగ్జిబిషన్‌, పార్కులు, వాహన పార్కింగ్‌ అంటూ హంగులతో ఈ నిర్మాణం ఉంటుందన్నారు. గోపాలకృష్ణ గాంధీ మాట్లాడుతూ కరుణానిధి పరిపాలనా దక్షుడని వ్యాఖ్యానించారు. తమిళ ప్రజలకు ఆయన సేవలను గుర్తు చేశారు.

Read latest Tamil Nadu News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top