
భూమిపూజలో పాల్గొన్న యూనియన్ చైర్‌పర్సన్ తంగధనం
పంచాయతీ కార్యాలయ భవనానికి భూమిపూజ
తిరుత్తణి: అలుమేలుమంగాపురం పంచాయతీ కార్యాలయానికి నూతన భవన నిర్మాణానికి శుక్రవారం భూమి పూజ చేశారు. యూనియన్ చైర్‌పర్సన్ తంగధనం పూజలు చేసి పనులను ప్రారంభించారు. తిరుత్తణి యూనియన్ అలుమేలుమంగాపురం గ్రామ పంచాయతీ కార్యాలయ భవనం కూలిపోవడంతో పరిపాలనకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో జాతీ య గ్రామీణ ఉపాధి హామీ పథకం నుంచి రూ.23.57 లక్షలతో పంచాయతీ భవన నిర్మా ణం చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. భూమిపూజ కార్యక్రమానికి పంచాయతీ సర్పంచ్ కవిత అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా యూనియన్ చైర్‌పర్సన్ తంగధనం పాల్గొని పనులను ప్రారంభించారు. పంచాయతీ ఉపాధ్యక్షురాలు లక్ష్మీ, గ్రామ కార్య దర్శి ఇళంగోవన్ తదితరులు పాల్గొన్నారు.
మృతిచెందిన ఆలయ ఎద్దుకు గ్రామస్తుల నివాళి
అన్నానగర్: ఎస్.పుదూరు సమీపంలో గురువారం మృతి చెందిన గుడి ఎద్దుకు గ్రామస్తులు నివాళులర్పించి పూడ్చిపెట్టారు. శివగంగై జిల్లా ఎస్.పుదూరు సమీపంలోని ముసుందపట్టి వద్ద సూరవలి దేవత ఆలయం ఉంది. గ్రామస్తులు ఈ ఆలయానికి సమర్పించిన దూడ బాగా పెరిగి గుడి ఎద్దుగా మారింది. ఈ ఎద్దు ఆలయంలో జరిగే వేడుకల్లో పాల్గొనేది. దీన్ని స్థానికులు ఎంతో ఆప్యాయంగా చూసుకునేవారు. కొన్ని రోజులుగా అనారోగ్యం బారిన పడింది. గురువారం మృతిచెందింది. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఎద్దు కళేబరానికి పసుపు, చందనం, కుంకుమ పూసి ఆలయం ముందు ఉంచారు. గ్రామ ఆలయం నిర్వాహకులు పుష్పగుచ్ఛాలు, పంచ, తలపాగా సమర్పించి నివాళులర్పించారు. అనంతరం బాణసంచా పేలుస్తూ ఎద్దు కళేబరాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లి ముసుండపట్టి పట్టవన్ దేవాలయం ఎదుట పూడ్చిపెట్టారు. అంతిమయాత్రలో పరిసర ప్రాంతాల నుంచి పలువురు పాల్గొన్నారు.