తమిళసినిమా: నటుడు, నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్ కథానాయకుడిగా నటించిన చిత్రం మామన్నన్. నటి కీర్తి సురేష్ నాయకిగా నటించిన ఈ చిత్రానికి పరియేరుమ్ పెరుమాళ్, కర్నన్ చిత్రాల ఫేమ్ మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించారు. రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 29న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ గురువారం సాయంత్రం చైన్నెలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో భారీ ఎత్తున నిర్వహించారు. ఇందులో నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమలహాసన్ హాజరయ్యారు. దర్శకుడు వెట్రిమారన్, మిష్కిన్, నటుడు శివకార్తికేయన్ అతిథులుగా పాల్గొన్నారు. ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ తాను కథానాయకుడిగా నటించిన చివరి చిత్రం ఇదని చెప్పారు. మారి సెల్వరాజ్ దర్శకత్వంలో నటించడం సంతోషం అన్నారు. ఇప్పుడు మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న కారణంగా ప్రజలకు చేయాల్సిన సేవలు, కార్యక్రమాలు చాలా ఉన్నాయన్నారు. అందుకే ఇకపై నటించకూడదని నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. అయితే దర్శకుడు మారిసెల్వరాజ్‌కు తాను వాగ్దానం చేశానని, మళ్లీ నటిస్తే మీ దర్శకత్వంలోనే నటిస్తానని చెప్పానని అన్నారు. అయితే అది వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఇచ్చే తీర్పును బట్టి ఉంటుందని ఉదయనిధి స్టాలిన్ పేర్కొన్నారు. కీర్తిసురేష్ మాట్లాడుతూ తాను ఇందులో కమ్యూనిస్టు భావాలు కలిగిన యువతిగా నటించినట్లు చెప్పారు. చాలా గ్యాప్ తరువాత తమిళంలో మంచి పాత్రను ఈ చిత్రంలో చేసినట్లు అన్నారు.