
తిరుత్తణి ఆలయ చైర్మన్, ట్రస్ట్ బోర్డు సభ్యులు పదవీ స్వీకారం
తిరుత్తణి: తిరుత్తణి ఆలయ చైర్మన్, ట్రస్ట్ బోర్డు సభ్యులు శుక్రవారం పదవీస్వీకారం చేశారు. రాష్ట్రంలో డీఎంకే అధికారం చేపట్టి రెండేళ్లు కావస్తున్నా తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి పాలక మండలిని నియమించలేదు. దీంతో అధికారుల ఆగడాలకు అంతేలేకుండా పోయింది. ఈ క్రమంలో తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయ పాలక మండలి సభ్యులుగా చైన్నెకు చెందిన శ్రీధరన్, తిరుత్తణికి చెందిన డీఎంకే నేతలు నాగన్, ఉషారవి, సురేష్‌బాబు, మోహనన్ సహా ఐదుగురిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వారు శుక్రవారం సుబ్రహ్మణ్యస్వామిని దర్శించుకుని ఆలయ కార్యాలయానికి చేరుకున్నారు. వారికి డిప్యూటీ కమిషనర్ విజయ ఆధ్వర్యంలో ఆలయ అధికారులు స్వాగతం పలికి పాలక మండలి సభ్యులుగా పదవీ స్వీకారం చేయించారు. అనంతరం పాలక మండలి ఐదుగురు సభ్యులు కలిసి చైర్మన్‌గా శ్రీధరన్‌ను ఎంపిక చేశారు. ఆయనకు అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. అదే సమయంలో తిరుత్తణి ఎమ్మెల్యే, జిల్లా డీఎంకే కార్యదర్శి చంద్రన్, మాజీ కార్యదర్శి భూపతి, డీఎంకే శ్రేణులు, ఆలయ అధికారులు, చైర్మన్, సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.