విద్యుత్ కోతలపై
ప్రజల ఆందోళన
తిరువొత్తియూరు: అంబత్తూరులో అర్ధరాత్రి విద్యుత్ సరఫరా నిలిపేయడంతో ప్రజలు రోడ్డుపై ఆందోళన చేపట్టారు. అంబత్తూర్, కల్లిక్ కుప్పం, మూకాంబికా నగర్, మాటనంగుప్పం, పూడూరు, ఒరగడం, కోయంబేడు రోడ్డు, మన్నూర్‌పేట, కొరట్టూరుతోపాటు పరిసర ప్రాంతాల్లో రాత్రిళ్లు తరచూ విద్యుత్ అంతరాయం ఏర్పడుతోంది. దీంతో ప్రజలు నిద్రలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై విద్యుత్ అధికారులను సంప్రదించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో ఆగ్రహించిన ప్రజలు కల్లికప్పంలోని విద్యుత్ కేంద్రం కార్యాలయాన్ని ముట్టడించి ధర్నా నిర్వహించారు.
డ్రైవర్ ఆత్మహత్య
అన్నానగర్: కినత్తుకడవు సమీపంలో గురువారం రాత్రి మద్యం తాగేందుకు డబ్బులు దొరకకపోవడంతో డ్రైవర్ విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కోయంబత్తూరు జిల్లా కినత్తుకడవు సమీపంలోని కొండంబట్టి మునియప్పన్ టెంపుల్ రోడ్డుకు చెందిన నాగసుబ్రమణ్యం (41) డ్రైవర్. ఇతనికి భార్య మూకాంబిక, 16 ఏళ్ల కుమార్తె వున్నారు. నాగ సుబ్రమణ్యంకు మద్యపానం అలవాటు ఉండడంతో పనికి వెళ్లకుండా రోజూ తాగేవాడు. గురువారం రాత్రి తాగడానికి డబ్బులు దొరకకపోవడంతో విసుగు చెంది ఇంటిలో విషం తాగి అపస్మారక స్థితిలో పడి వున్నాడు. గమనించిన ఇరుగుపొరుగు వారు అతడిని ఒత్తక్కల్ మండపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడి నుంచి కోయంబత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం వేకువజామున మృతి చెందాడు. కినత్తుక్కడవు ఎస్‌ఐ సెంథిల్‌కుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
తండ్రి మందలించాడని కుమారుడు ఆత్మహత్య
అన్నానగర్: మంగళంపేట సమీపంలో సెల్‌ఫోన్‌లో గేమ్స్ ఆడుతుండడంతో కొడుకును తండ్రి మందలించాడు. దీంతో మనస్తాపం చెందిన కొడుకు శుక్రవారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కడలూరు జిల్లా మంగళంపేట సమీపంలోని విళాలూరు గ్రామానికి చెందిన భాస్కరన్ కుమారుడు తమిళేంది (15) కళ్లకురిచ్చి జిల్లా ఉలుందూరుపేటలోని ఓ ప్రైవేటు పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో ఇంట్లోనే ఉన్నాడు. తమిళేంది నిరంతరం సెల్‌ఫోన్‌లో గేమ్స్ ఆడుతుండడంతో భాస్కరన్ గురువారం మందలించాడు. అనంతరం అతను మంగళంపేటకు వెళ్లాడు. రాత్రి అతను వచ్చేసరికి తమిళేంది ఇంటిలో చీరకు వేలాడుతూ కనిపించాడు. వెంటనే ఉలుందూరుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి విల్లుపురంలోని ముండియంబాక్కం ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ తమిళేంది మృతి చెందాడు. మంగళంపేట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
లారీ ఢీకొని మహిళ మృతి
తిరువొత్తియూరు: లారీ ఢీకొని ఓ మహిళ మృతిచెందింది. ఈ ఘటన చైన్నె కొడంగయూరులో డంప్‌యార్డులో చోటుచేసుకుంది. చైన్నె కొరకుపేట, జేజే నగర్‌కు చెందిన పార్వతి (45) చెత్తకుప్పలను సేకరించే పనిలో నిమగ్నమై ఉంది. ఆ సమయంలో చెత్త లారీ పార్వతిని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆమె మృతిచెందింది. పార్వతికి ముత్తు కుమారన్ భర్త, శివకుమార్ (24) కుమారుడు ఉన్నారు. కొడంగయూరు పోలీసులు పార్వతి మృతదేహాన్ని న్లీ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.