● పది మందికి గాయాలు
అన్నానగర్: వరుసగా ఐదు వాహనాలు ఢీకొని పదిమంది గాయపడ్డారు. ఈ ఘటన పూందమల్లి సమీపంలోని సెంబరంపాక్కంలో శుక్రవారం ఉదయం చోటుచసుకుంది. కుత్తంబాక్కం 4వ రోడ్ జంక్షన్ వద్ద వెళుతున్న మినీ కార్గోలారీ సడన్‌గా బ్రేక్ వేసింది. దీంతో వెనుక వేగంగా వచ్చిన రెండు వ్యాన్లు సహా ఐదు వాహనాలు, కంపెనీ ఉద్యోగులు ప్రయాణిస్తున్న ప్రైవేటు బస్సు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఐదు వాహనాల్లో ప్రయాణిస్తున్న పదిమంది ప్రయాణికులకు గాయాలై తండాలంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విషయం తెలిసి డివిజినల్ పోలీసులు క్రేన్ సాయంతో రోడ్డుకు అడ్డంగా ఉన్న వాహనాలను తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.
18 కిలోల గంజాయి స్వాధీనం
● యువకుడి అరెస్ట్
తిరువొత్తియూరు: చైన్నె కుండ్రత్తూరులో 18 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని యువకుడిని అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. కుండ్రత్తూరు, దాని పరిసర ప్రాంతాల్లో ఎక్కువ మొత్తంలో గంజాయి విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. విజిలెన్స్ పోలీసులు గురువారం రాత్రి నిఘా పెట్టారు. ఈ క్రమంలో కుండ్రత్తూరులో అనుమానాస్పద స్థితిలో తిరుగుతున్న యువకుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. అతను కేరళ రాష్ట్రానికి చెందిన మహమ్మద్ రిజ్వాన్ (26) అని తెలిసింది. అతను ఆంధ్ర, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి గంజాయి తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. అతని నుంచి 18 కిలోల గంజాయి, ఒక సెల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.