
తమిళసినిమా: కోలీవుడ్‌లో స్టార్ హీరోలకు నటి త్రిష ఒకే ఆప్షన్‌గా మారారా? ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే ఈ ప్రశ్నకు అవుననే బదులే వస్తోంది. ఇంతకు ముందు మూకాల్లోతు ప్లాపుల్లో కూరుకుపోయిన ఈ చైన్నె చిన్నది ఒక్క హిట్ కోసం ఎదురు చూశారు. అందుకు దర్శకుడు మణిరత్నం ఆపద్బాందవుడిగా మారారు. పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో యువరాణి కుందవై పాత్రలో నటించే అవకాశం కల్పించారు. ఆ అవకాశాన్ని త్రిష చాలా బాగా సద్వినియోగం చేసుకున్నారనే చెప్పాలి. దీంతో ఇప్పుడు కోలీవుడ్‌లో ఈమె జపమే వినిపిస్తోంది. కమలహాసన్, విజయ్, అజిత్, తాజాగా ధనుష్‌కు కూడా త్రిషనే ఏకై క ఆప్షన్‌గా కనిపిస్తోంది. ప్రస్తుతం విజయ్‌కు జంటగా లియో చిత్రంలో నటిస్తున్న ఈ భామ తర్వాత అజిత్ సరసన విడా ముయర్చి చిత్రంలో నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ తరువాత కమలహాసన్ 234వ చిత్రంలోనూ ఈ అమ్మడే నాయకి అనే టాక్ వినిపిస్తోంది. కాగా తాజాగా ధనుష్ సరసన మరోసారి జతకట్టే అవకాశం ఈ బ్యూటీ తలుపు తట్టినట్లు సమాచారం. ప్రస్తుతం కెప్టెన్ మిల్లర్ చిత్రంలో నటిస్తున్న ధనుష్ తర్వాత స్వీయ దర్శకత్వంలో భారీ చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించనున్న ఇందులో ముఖ్యపాత్రల్లో ఎస్‌జే.సూర్య, సందీప్ కిషన్, విష్ణు విశాల్, కాళిదాస్ జయరామ్, నటి దుషారా విజయన్ నటించనున్నట్లు ప్రచారంలో ఉంది. తాజాగా ఇందులో ధనుష్‌కు జంటగా త్రిషను నటింపచేయడానికి చర్చలు జరుగుతున్నట్లు తెలిపింది. ఈమె ఇంతకు ముందు కొడి చిత్రంలో ధనుష్‌కు జతగా నటించారన్నది గమనార్హం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. కాగా ఈ భారీ చిత్రానికి ఏఆర్.రెహ్మాన్ సంగీతాన్ని అందించనున్నారు.
త్రిష