
కార్యక్రమంలో జస్టిస్ వైద్యనాథన్, సీజే గంగాపుర్వాల, జస్టిస్ మహాదేవన్
సాక్షి, చైన్నె: అందరం కలిసికట్టుగా పనిచేద్దామని మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజయ్ విజయ్‌కుమార్ గంగా పుర్వాల పిలుపునిచ్చారు. మద్రాసు హైకోర్టుకు 33వ ప్రధాన న్యాయమూర్తిగా ఎస్‌వీ గంగాపుర్వాలను గత నెలాఖరులో నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆదివారం ఆయన చేత రాష్ట్ర గవర్నర్ ఆర్‌ఎన్ రవి ప్రమాణ స్వీకారం చేయించారు. కొత్త సీజేగా నియమితులైన గంగాపుర్వాల గురు వారం బాధ్యతలు స్వీకరించారు. ముందుగా హైకోర్టు ఆవరణలో ఆయనకు రాష్ట్ర ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ షణ్ముగసుందరం, బార్ కౌన్సిల్ నాయకులు పీఎస్ అమల్‌రాజ్, న్యాయవాద సంఘం నాయకుడు మోహనకృష్ణన్ ఆహ్వానం పలికారు. సీజేకు ఆహ్వానం పలుకుతూ ఏర్పాటు చేసిన సమావేశంలో న్యాయరంగంలో ఆయన పయనం గురించి పలువురు ప్రసంగించారు. చివరగా సీజే గంగాపుర్వాల ప్రసంగించారు. తమిళనాడులోని మద్రాసు హైకోర్టులో పనిచేసిన వాళ్లు ఎందరో సుప్రీంకోర్టులో న్యాయమూర్తులుగా ఉన్నారని గుర్తు చేశారు. ఎంతో చరిత్ర కలిగిన ఈ హైకోర్టులో పనిచేసే అవకాశం తనకు రావడం ఆనందంగా ఉందన్నారు. తమిళనాడులోని సంస్కృతి, సంప్రదాయాలు, పారంపర్యం తనకు ఎంతో ఇష్టమని, అందుకే మీలో ఒక్కడిగా ఇక్కడ పనిచేయడానికి వచ్చానని పేర్కొన్నారు. అందరం కలిసికట్టుగా పనిచేద్దామని, ప్రజలకు న్యాయం చేకూర్చే తీర్పులు, ఉత్తర్వులు, ఆదేశాలు ఇద్దామని, న్యాయపరంగా సేవలు విస్తృతం చేద్దామని పిలుపునిచ్చారు. సీనియర్ న్యాయమూర్తులు వైద్యనాథన్, ఆర్ మహాదేవన్ పాల్గొన్నారు.
సీజే గంగా పుర్వాల