కేజ్రీ ‘వార్‌’కు స్టాలిన్‌ మద్దతు

కేజ్రీవాల్‌, భగవంత్‌మాన్‌లతో చర్చిస్తున్న సీఎం స్టాలిన్‌, టీఆర్‌బాలు, కనిమొళి  - Sakshi

● ప్రజాస్వామ్య పరిరక్షణకు ఏకమవుదామని పిలుపు ● చైన్నెలో స్టాలిన్‌తో కేజ్రీవాల్‌ భేటీ

సాక్షి, చైన్నె: సుప్రీంకోర్టు తీర్పును కాలరాస్తూ, తమకు సమస్యలు సృష్టించే విధంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ మద్దతు ఇచ్చారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు బీజేపీయేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏకం కావాలని ఈసందర్భంగా స్టాలిన్‌ పిలుపునిచ్చారు. ఢిల్లీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే విధంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇటీవల ఓ ఆర్డినెన్స్‌ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీనిని ఆమ్‌ ఆద్మీ పార్టీ నేతలు, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌, పంజాబ్‌ సీఎం భగవంత్‌మాన్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బీజేపీయేతర రాష్ట్రాల సీఎంలతో పాటు జాతీయస్థాయిలోని ప్రధాన పార్టీల నేతలతో కేజ్రీవాల్‌, భగవంత్‌మాన్‌ భేటీ అవుతూ వస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం సాయంత్రం చైన్నెలో సీఎం స్టాలిన్‌తో ఆ ఇద్దరు సీఎంలు సమావేశమయ్యారు. స్టాలిన్‌ నివాసంలో ఈ సమావేశం అరగంట పాటు జరిగింది. తన నివాసానికి వచ్చిన కేజ్రీవాల్‌, భగవత్‌మాన్‌లను సీఎం స్టాలిన్‌, ఆపార్టీ ఎంపీలు టీఆర్‌బాలు, కనిమొళి ఆహ్వానించారు.

ఏకమవుదాం...

సమావేశానంతరం సీఎం స్టాలిన్‌ మీడియాతో మాట్లాడుతూ తనకు కేజ్రీవాల్‌ మంచి మిత్రుడని కొనియాడారు. ఢిల్లీలో బడులను మోడ్రన్‌గా తీర్చిదిద్దిన విషయం తెలియగానే తాను స్వయంగా వెళ్లి పరిశీలించినట్టు గుర్తు చేశారు. ప్రస్తుతం తమిళనాడులో అదే తరహాలో పాఠశాలలను ఆధునీకరిస్తున్నామని వివరించారు. అలాగే, ప్లస్‌టూ ఉత్తీర్ణతతో ఉన్నత చదువులు అభ్యసించే విద్యార్థినులకు నెలకు రూ.1000 నగదు పంపిణీ నిమిత్తం తన ప్రభుత్వం చేపట్టిన పుదుమై పెన్‌ పథకం ప్రారంభోత్సవానికి కేజ్రీవాల్‌ హాజరు అయ్యారని గుర్తుచేశారు. ప్రస్తుతం ఢిల్లీ ప్రభుత్వాన్ని, ఆమ్‌ ఆద్మీ పార్టీని ఇరకాటంలో పెట్టే విధంగా కేంద్రంలోని బీజేపీ పాలకుల చర్యలు ఉన్నాయని ధ్వజమెత్తారు. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా, దానిని కాల రాస్తూ, అది అమలు కానివ్వకుండా కేంద్ర పాలకులు ఆర్డినెన్స్‌ తీసుకు రావడాన్ని ఖండిస్తున్నామన్నారు. ఇద్దరు సీఎంలతో తాను ఇదే విషయంగా సుదర్ఘీంగా చర్చించినట్టు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ యేతర సీఎంలతో చర్చించడమే కాదు, ప్రజాస్వామ్య పరిరక్షణలో అందరూ ఏకం కావాల్సిన సమయం ఇదే అని పిలుపునిచ్చారు. గతవారం జరగాల్సిన సమావేశం తన విదేశీ పర్యటన కారణంగా వాయిదా పడినట్లు పేర్కొన్నారు. జూన్‌ 12న జరిగే జాతీయస్థాయిలో పార్టీల సమావేశానికి తాను హాజరుకాలేని పరిస్థితి ఉందని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. అదే రోజున తాను డెల్టా అన్నదాతల కోసం మేట్టూరు జలాశయం నీటి విడుదల కార్యక్రమానికి హాజరుకావాల్సి ఉందన్నారు.

Read latest Tamil Nadu News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top