● సీఎం స్టాలిన్‌ ధీమా ● రూ.3,223 కోట్లకు ఒప్పందాలు ● కక్ష సాధింపు ధోరణిలో కేంద్రం

- - Sakshi

సాక్షి, చైన్నె: సీఎం స్టాలిన్‌, పరిశ్రమలశాఖ మంత్రి టీఆర్‌బీ రాజాతో పాటు అధికారులు పలువురితో కూడిన బృందం గత నెల విదేశీ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. తొమ్మిది రోజుల పాటు సింగపూర్‌, జపాన్‌ దేశాలలో ఈబృందం పర్యటించింది. విదేశీ పర్యటనను ముగించుకుని బుధవారం అర్ధరాత్రి సీఎం స్టాలిన్‌ చైన్నెకు చేరుకున్నారు. ఆయనకు విమానాశ్రయంలో మంత్రులు కేఎన్‌ నెహ్రూ, పొన్ముడి, ఏవీ వేలు, శేఖర్‌బాబు, ఎం.సుబ్రమణియన్‌ ఆహ్వానం పలికారు. సీఎం స్టాలిన్‌ మీడియాతో మాట్లాడుతూ సింగపూర్‌, జపాన్‌ పర్యటనలోని విశేషాలను వివరించారు.

ఆనందంగా...

విదేశీ పర్యటన ఆనందంగా, విజయవంతంగా సాగినట్టు వివరించారు. తమిళనాడు– జపాన్‌ మధ్య వృత్తిపరంగా, ఆర్థికపరంగా సంబంధం మరింత బలపడినట్టు తెలిపారు. అతిపెద్ద ప్రాజెక్టులపై దృష్టిపెట్టామని వివరించారు. ఆసియాలోనే అతి పెద్ద ఉత్పత్తి కేంద్రంగా తమిళనాడును తీర్చిదిద్దాలన్న తన సంకల్పానికి బలాన్ని చేకూర్చే విధంగా జపనీస్‌ కంపెనీలు మద్దతు ఇచ్చాయని వివరించారు. హైబీ కంపెనీ రూ.312 కోట్లు, డీజిల్‌ కంపెనీ రూ. 83 కోట్లు, క్యోకుటో కార్పొరేషన్‌ రూ.113 కోట్లు, మిట్సుబిషి ఇండియా రూ. 155 కోట్లు, బల్‌యోహోస్‌ రూ.150 కోట్లు, బాలిహుస్‌ కోహేయి రూ.200 కోట్లు, బల్లిహోస్‌ చట్టో – షోజి రూ. 200 కోట్లు, ఓమ్రాన్‌ హెల్త్‌ కేర్‌ రూ. 128 కోట్లు చొప్పున మొత్తంగా రూ.3,233 కోట్లు రాష్ట్రంలోకి పెట్టుబడులు పెట్టేందుకు అవగాహన ఒప్పందాలు కుదిరినట్టు చెప్పారు. ఈ పరిశ్రమల ద్వారా 5 వేల మందికి ప్రత్యేక్షంగా, పరోక్షంగా మరెన్నో వేల మందికి ఉపాధి అవకాశాలు దక్కబోతున్నాయన్నారు. వివిధ రంగాల్లోని ప్రముఖ కంపెనీలతో అవగాహన ఒప్పందాలు జరగడం ఆనందంగా ఉందన్నారు. పరిశ్రమల అభివృద్ధి, భవిష్యత్తు ప్రణాళికలు, పెట్టుబడులకు సంబంధించిన అన్ని రకాల అంశాలను మరెన్నో విదేశీ సంస్థలకు వివరించామన్నారు. 2024 జనవరిలో 10,11 తేదీల్లో జరిగిన పెట్టుబడిదారుల మహానాడుకు పెద్ద సంఖ్యలో పారిశ్రామిక వేత్తలు తరలి వచ్చే అవకాశాలు ఉన్నాయన్నాయని ధీమా వ్యక్తం చేశారు.

ప్రశ్నలకు సమాధానాలు..

సీఎం స్టాలిన్‌ ముందు మీడియా ప్రతినిధులు పలు ప్రశ్నలను ఉంచారు. పెట్టుబడి దారులను ఆకర్షించేందుకు వెళ్లారా, లేదా, పెట్టుబడులు పెట్టేందుకు వెళ్లారా అని ప్రధాన ప్రతిపక్ష నేత పళనిస్వామి చేసిన ఆరోపణకు సమాధానం ఇస్తూ, అందరూ వారి వలే ఉంటారా వారి విజ్ఞతకే వదలి పెడుతున్నట్టు వ్యాఖ్యలు తూటాలను సందించారు. గతంలో వారు విదేశీ పర్యటనకు వెళ్లారని, ఆ సమయంలో వారు ఒలక బెట్టింది వారి మదిలో నుంచే ప్రశ్న రూపంలో బయటకు వచ్చినట్టుందని విమర్శించారు. మేఘదాతు వ్యవహారంలో కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్‌ వ్యాఖ్యలను గుర్తు చేయగా, ఇప్పటికే రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి దురైమురుగన్‌ స్పష్టమైన సమాధానం ఇచ్చారని పేర్కొన్నారు. మేఘదాతు వ్యవహారంలో కానీయండి, కావేరి జల వ్యవహారంలో కానీయండి తమ నిర్ణయం ఎన్నటికీ మారదు అని స్పష్టం చేశారు. ఎవరు ఏమైనా చెప్పుకోనీయండి, తమ పని తాము చేసుకుంటూ అడ్డుకట్ట వేస్తామన్నారు. పార్లమెంట్‌ భవనంలో రాజదండం ఏర్పాటు గురించి ప్రస్తావించగా, వాస్తవానికి అది చోళుల కాలానికి సంబంఽధించినదిగా ఉండి ఉంటే తమిళనాడుకే గర్వకారణం అని వ్యాఖ్యలు చేశారు. అయితే, అది ఆ కాలానికి సంబంధం లేదని చరిత్రకారులు స్పష్టం చేస్తున్నారని పేర్కొన్నారు. విద్యుత్‌మంత్రి సెంథిల్‌బాలాజీని ఐటీ టార్గెట్‌ చేయడాన్ని గుర్తు చేయగా, తమకు అణిగిమణిగి ఉండేందుకు ఇష్టపడని రాష్ట్ర ప్రభుత్వాలపై కేంద్రం ఐటీ, ఈడీ, సీబీఐ ద్వారా దాడులు చేయిస్తూ వస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. ప్రస్తుతం వారి కక్ష సాధింపు ధోరణి తమిళనాడుపై పడ్డట్టుందని, అందుకే ప్రస్తుతం దాడులను హోరెత్తిస్తున్నారని, మున్ముందు చుట్టుముట్టినా ముట్టేస్తారని చమత్కరించారు. రాజ్‌భవన్‌లో సెంగోల్‌పై జరిగిన వివరణాత్మక సమావేశానికి రాష్ట్ర మంత్రి శేఖర్‌బాబు హాజరు అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రశ్నించగా, కేంద్ర ప్రభుత్వ తరఫుజరిగే కార్యక్రమం అని చెప్పడంతో తమ మంత్రి హాజరయ్యారని, అయితే, అక్కడ ఆతర్వాత ఏం జరిగిందో అన్న విషయం అందరికీ బాగానే తెలుసునని పేర్కొన్నారు. ఈ విషయంగా శేఖర్‌బాబు ఇప్పటికే వివరణ ఇచ్చారన్నారు. జూన్‌ 12న విపక్షాల తరపున బిహార్‌లో జరిగే ప్రతిపక్ష పార్టీలను ఏకం చేసే సమావేశానికి డీఎంకే హాజరవుతుందని స్పష్టం చేశారు.

Read latest Tamil Nadu News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top