
ధర్నా చేస్తున్న ట్రైనీ డాక్టర్లు
తిరువొత్తియూరు: వైద్య కళాశాల ఆసుపత్రి అధ్యాపకుడు లైంగికంగా వేధిస్తున్నారని ఆరోపిస్తూ చెంగల్పట్టు ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రైనింగ్ వైద్య విద్యార్థినులు, ట్రైనీ డాక్టర్లు ఆందోళన చేపట్టారు. చెంగల్పట్టు ప్రభుత్వ వైద్య కళాశాలలో మూడవ సంవత్సరం చదువుతున్న విద్యార్థినిని కళాశాల ప్రొఫసర్ లైంగికంగా వేధించినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై బాధిత విద్యార్థిని ఆసుపత్రి డీన్‌కు ఫిర్యాదు చేశారు. ఫలితం లేకపోవడంతో 50 మందికి పైగా ట్రైనీ డాక్లర్లు గురువారం ఆసుపత్రి ప్రాంగణంలో ధర్నా చేపట్టారు. సమాచారం అందుకున్న చెంగల్పట్టు నగర పోలీసులు, ఆసుపత్రి వైద్య కార్యాలయాధికారి అనిత తదితరులు అక్కడికి చేరుకుని వారితో చర్చించారు. ప్రొఫసర్‌పై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో డాక్టర్లు సమ్మె విరమించారు.