మిర్యాలగూడ టౌన్ : హిందూ సమాజాన్ని సంఘటితంగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పని చేయాలని జగిత్యాల ధర్మ రక్షణ పీఠాధిపతి లక్ష్మీనారాయణ స్వామీజీ అన్నారు. ఆదివారం మిర్యాలగూడ పట్టణంలోని వాసవీనగర్ కాలనీ చౌరస్తాలో నిర్వహించిన హిందూ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. హిందూ సంస్థలు పట్టణ, గ్రామాల్లోని ప్రజల్లో దేశభక్తి భావాన్ని పెంపొందించాలన్నారు. హిందువులందరినీ సంఘటితం చేయడంతో పాటు హిందూ సంప్రదాయాలు భావితరాలకు అందడం ద్వారా దేశభక్తిని పెంపొందించుకోవచ్చన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ తెలంగాణ ప్రాంత బౌద్ధిక్ ప్రముఖ్, వికారాబాద్ సిద్ధార్థ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కూర జయదేవ్, హైదరాబాద్‌లోని కేశవ మెమోరియల్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్, స్వదేశీ జాగరణ మంచ్ తెలంగాణ ప్రాంత ప్రముఖ్ డాక్టర్ స్వప్న మాట్లాడుతూ.. హిందూ ధర్మం అంటేనే ఒక ఉమ్మడి కుటుంబం లాంటిదన్నారు. తెలంగాణ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కర్నాటి రమేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ తిరంశెట్టి సీత కోటేశ్వర్‌రావు, ఆర్‌ఎస్‌ఎస్ జిల్లా సహ వ్యవస్థాపకుడు చెరుపల్లి కరుణాకర్, గూడూరు శ్రీనివాస్‌రావు, జనార్దన్, గాయం నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.


