ఉన్నతాధికారులు ఆలోచించాలి
కోదాడ: కోదాడ పట్టణ పరిధిలోని లక్ష్మిపురం ఇందిరమ్మ కాలనీలో రూ.2 కోట్లతో నిర్మించిన వసతిగృహాన్ని ప్రారంభించకుండా వదిలేశారు. కానీ గిరిజన కళాశాల విద్యార్థుల వసతి గృహాన్ని అద్దె భవనంలో కొనసాగిస్తూ లక్షల రూపాయలను అద్దెల రూపంలో చెల్లిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, వసతి గృహాలను అందుబాటులో ఉన్న ప్రభుత్వ భవనాల్లోకి మార్చాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా గిరిజన సంక్షేమశాఖ అధికారులు మాత్రం నిద్రమత్తు వదలడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.
నిర్లక్ష్యంగా వదిలేశారు
లక్ష్మిపురం ఇందిరమ్మ కాలనీలో రెండు అంతస్తులతో రెండు వందల మంది విద్యార్ధులు ఉండే విధంగా గిరిజన కళాశాల విద్యార్థుల వసతిగృహం నిర్మించారు. పనులన్నీ పూర్తయ్యాయి. ఈలోగా ప్రభుత్వం మారడంతో అధికారులు ఈ భవనం విషయాన్ని మర్చిపోయారు. ఇదే సమయంలో గిరిజన విద్యార్థుల వసతి గృహాన్ని అద్దెబవనంలో కొనసాగిస్తూ దానికి సంవత్సరానికి లక్షల రూపాయలను అద్దెల రూపంలో చెల్లిస్తున్నారు.
కళాశాలకు దూరంగా..
కోదాడ పట్టణానికి లక్ష్మిపురం కాలనీ మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడికి వెళ్లడానికి కనీస రవాణ సౌకర్యాలు కూడా లేవు. పట్టణంలో ఉన్న ఏ ఒక్క కళాశాల దీనికి సమీపంలో లేవు. ఇవేమీ ఆలోచించకుండా అధికారులు కోట్ల రూపాయల ఖర్చు చేసి అక్కడ వసతి గృహాన్ని నిర్మించారు. నిర్మించిన అధికారులు దాన్ని వినియోగంలోకి తీసుకురాలేదు. లక్ష్మిపురం కాలనీలో ప్రభుత్వ పాఠశాల లేదు. ఇక్కడ 700లకు పైగా గృహాలున్నాయి. కనీసం ఈ భవనంలో ప్రభుత్వ పాఠశాలను ప్రారంభించాలని కాలనీ వాసులు కోరుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. అంతేకాకుండా కేఆర్‌ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద రూ.50 లక్షల యూజీసీ నిధులతో నిర్మించిన వసతిగృహం కూడా పది సంవత్సరాలుగా ఖాళీగా ఉంటుంది. పట్టణంలో అద్దె భవనాల్లో కొనసాగుతున్న మరోనాలుగు వసతి గృహాల్లో ఒకదానిని ఇందులోకి మారిస్తే లక్షల రూపాయల అద్దె చెల్లించే భారం ప్రభుత్వానికి తగ్గుతుంది. ఉన్నతాధికారులు ఈ విషయంలో దృష్టిసారించాలని పలువురు కోరుతున్నారు.
ప్రారంభించకుండా వదిలేసిన గిరిజన కళాశాల విద్యార్థుల వసతిగృహం
అద్దె భవనంలో నిర్వహిస్తూ
రూ.లక్షల్లో చెల్లిస్తున్న అధికారులు
కోదాడ పట్టణ పరిధిలోని శ్రీరంగాపురం ఆంజనేయస్వామి దేవాలయానికి ఎదురుగా అద్దె ఇంట్లో నిర్వహిస్తున్న గిరిజన కళాశాల విద్యార్థుల వసతిగృహం గడిచిన మూడు సంవత్సరాలుగా అద్దె భవనంలో కొనసాగుతోంది. కనీస సౌకర్యాలు లేకపోయినా గత్యంతరం లేక విద్యార్థులు ఈ భవనంలో ఉంటున్నారు. ఈ భవనానికి నెలకి 55 వేల చొప్పున సంవత్సరానికి రూ.6 లక్షలు అద్దె చెల్లిస్తున్నారు. ఇదే సమయంలో పట్టణ పరిధిలోని లక్ష్మీపురం కాలనీలో రూ. 2 కోట్లతో మూడు సంవత్సరాల క్రితం సకల సౌకర్యాలతో ఇదే గిరిజన కళాశాల విద్యార్థుల కోసం నిర్మించిన వసతి గృహం వినియోగంలోకి లేకుండా వదిలేశారు.
కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన భవనాలను ఖాళీగా ఉంచి అద్దె భవనాలకు లక్షల రూపాయలు చెల్లించడం శోచనీయం. ఇది ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే. ఈవిషయంలో ఉన్నతాధికారులు దృష్టి సారించి చర్యలు తీసుకోవాలి. ప్రజాధనం దుర్విని యోగం కాకుండా చూడాలి.
– రాయపూడి చిన్ని,
ప్రజా చైతన్య వేదిక కన్వీనర్


