భానుపురి (సూర్యాపేట) : జిల్లావ్యాప్తంగా వరి కోతలు మొదలయ్యాయి. ఈమేరకు అధికారులు అన్ని మండలాల్లోనూ ధాన్యం కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చేశారు. అయితే జిల్లాలో ఎక్కడా ప్రభుత్వ కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. ఈక్రమంలో రైతులు సన్న ధాన్యాన్ని ప్రైవేట్ మిల్లులకు తరలిస్తున్నారు. దొడ్డురకం ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ఆరబెడుతున్నారు.
4.82 లక్షల ఎకరాల్లో వరిసాగు..
జిల్లాలో దాదాపు 4.82 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. మొత్తం ధాన్యం దిగుబడి 9లక్షల మెట్రిక్ టన్నులు ఉంటుందని, 4.10లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. సన్నరకం 2 లక్షల వరకు ఉంటుంది. ప్రధానంగా హుజూర్‌నగర్, కోదాడ నియోజకవర్గాల పరిధిలో ఈ ధాన్యాన్నే సాగు చేశారు. అలాగే సూర్యాపేట, తుంగతుర్తి ప్రాంతాల్లోనూ దొడ్డురకం అధికంగా, సన్నరకం వరిని కొంతమేర రైతులు సాగు చేశారు. ఈ క్రమంలో మొదటగా నాటుపెట్టిన పొలాలు కోతకు వచ్చాయి. ఇందులో దొడ్డురకం, సన్నరకం రెండు ఉన్నాయి. ఈ రెండు రకాల ధాన్యాలకు ప్రభుత్వం వేర్వేరుగా 334 కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చేశారు. బోనస్ కారణంగా సన్నరకాలు సైతం కొనుగోలు సెంటర్లకు అధికంగానే వస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 15వేల ఎకరాలకు పైగా వరి కోతలు పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ వారంలో ముమ్మరం కానున్నాయి. ఒకేసారి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు ధాన్యం వెల్లువలా రానుంది.
ఇంకా ప్రారంభం కాని
కొనుగోలు కేంద్రాలు
సన్నధాన్యం ప్రైవేట్ మిల్లులకు..
దొడ్డుధాన్యం కొనుగోలు సెంటర్లకు తరలిస్తున్న రైతులు
సన్నాలు ప్రైవేట్ మిల్లులకు..
చింట్ల వంటి కొన్నిరకాల సన్నాలు పచ్చిగా ఉన్నప్పుడే ధర ఉంటుంది. వీటిని సాగు చేసిన రైతులు నేరుగా ప్రైవేట్ మిల్లులకు తరలిస్తున్నారు. ఇప్పటికే హుజూర్‌నగర్, కోదాడ నియోజకవర్గాల ప్రాంతాల్లో కోతలు ప్రారంభమై ఆయా ప్రాంతాలతో పాటు మిర్యాలగూడలో ఉన్న ప్రైవేట్ మిల్లుల్లో విక్రయిస్తున్నారు. ఒక్కో క్వింటాకు రూ.2400ల వరకు ధర పడుతుండడంతో రైతులు ఎలాంటి శ్రమ లేకుండా ఉంటుందని మిల్లుల్లోనే అమ్ముకుంటున్నారు. సూర్యాపేట, తుంగతుర్తి ప్రాంతాల రైతులు సైతం ప్రైవేట్ మిల్లులకే సన్నరకాలను తరలిస్తున్నారు. కొందరు రైతులు దొడ్డురకం ధాన్యాన్ని ప్రైవేటుగా మార్కెట్‌లో అమ్మకానికి వెళ్తే దాదాపు రూ.1700ల నుంచి రూ.1850ల వరకు ధర వస్తోంది. ఈ నేపథ్యంలో దొడ్డురకం ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లి.. మద్దతు ధర కోసం రైతులు చూస్తున్నారు. కొనుగోళ్లు ప్రారంభమైన తర్వాత సన్నాలను సైతం ఈ సెంటర్లకే తరలించనున్నారు.


