భానుపురి (సూర్యాపేట) : బాబు జగ్జీవన్‌రామ్ సేవలు చరిత్రలో నిలిచిపోతాయని అదనపు కలెక్టర్ సీతారామారావు అన్నారు. ఆదివారం జగ్జీవన్ రాం జయంతి సందర్భంగా జిల్లా షెడ్యూల్డ్ కులాల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సూర్యాపేటలోని కొత్త బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన జయంతి ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జగ్జీవన్‌రామ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. జగ్జీవన్ రామ్ విద్యాభ్యాసం నుంచి కుల వివక్షత ఎదుర్కొన్నారని తెలిపారు. అట్టడుగు వర్గాల సంక్షేమానికి అనేక పోరాటాలు చేశారని గుర్తు చేశారు. 30 ఏళ్లపాటు కేంద్ర కేబినేట్‌లో అనేక కీలక పదవులు చేపట్టి ఆ పదవులకే వన్నె తెచ్చారని పేర్కొన్నారు. నేటి యువత ఆయన ఆశయాలను, స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మొరిశెట్టి నివేదిత, అడిషనల్ ఎస్పీ రవీందర్ రెడ్డి, సూర్యాపేట ఆర్డీఓ వేణుమాధవ్, మాజీ ఎమ్మెల్యే దోసపాటి గోపాల్‌రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, డీఎంహెచ్‌ఓ వెంకటరమణ, ఎస్సీ సంక్షేమ అధికారి లత, మున్సిపల్ కమిషనర్ హనుమంత్ రెడ్డి, వైస్ చైర్మన్ షఫీఉద్దీన్, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ సీతారామారావు


