విద్యుత్ అంతరాయాలు ఏర్పడినప్పుడు తక్షణం సరఫరాను పునరుద్ధరించి వినియోగ దారులకు మెరుగైన సేవలు అందించేందుకు ఈఆర్‌టీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చాం. 24 గంటల పాటు ఈ సేవలు అందించేందుకు మా అధికారులు, ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారు. ప్రజలు తమ సమస్యలను టోల్‌ప్రీ నంబర్ 1912 ద్వారా తెలియజేయవచ్చు.
– శ్రీనివాస్, ఎస్‌ఈ, జిల్లా విద్యుత్ శాఖ
●
● మెరుగైన విద్యుత్ సరఫరాకు
పటిష్ట కార్యాచరణ
● ఎమర్జెన్సీ రీస్టోరేషన్
వాహనాలు
సిద్ధం చేసిన విద్యుత్ శాఖ
● అందుబాటులోకి
ఈఆర్‌టీ సేవలు
సూర్యాపేట అర్బన్ : ప్రకృతి విపత్తులు, భారీ వర్షాలు, ఈదురు గాలులు, సాంకేతిక కారణాలతో విద్యుత్ సరఫరాలో ఏర్పడే అంతరాయం లేకుండా చూసేలా జిల్లా విద్యుత్ శాఖ అత్యవసర పునరుద్ధరణ బృందాలు (ఈఆర్‌టీ–ఎమర్జెన్సీ రీస్టోరేషన్ టీం) సేవలను అందుబాటులోకి తెచ్చింది. సంస్థ సూపరింటెండెంట్ ఇంజనీర్ (ఎస్‌ఈ) శ్రీనివాస్ నేతృత్వంలో ప్రస్తుత వేసవిలో తలెత్తనున్న విద్యుత్ సమస్యలను దృష్టిలో పెట్టుకుని వినియోగదారులకు వేగవంతమైన, నాణ్యమైన సేవలను అందించేందుకు అత్యవసర రీస్టోరేషన్ బృందాలను సిద్ధం చేశారు. ఈ బృందాల ద్వారా విద్యుత్ అంతరాయం సమస్యలను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరిస్తారు. వేసవి అనంతరం కూడా ఈ రీస్టోరేషన్ వాహనాలు అందుబాటులో ఉండనున్నాయి.
జిల్లాలో ఏడు ఈఆర్‌టీ వాహనాలు
జిల్లాలో ఏడు ఎమర్జెన్సీ రీస్టోరేషన్ టీం (ఈఆర్‌టీ) వాహనాలను అధికారులు సిద్ధం చేశారు. ఇవి 24 గంటల పాటు సేవలు అందించేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు తక్షణం రంగంలోకి దిగేందుకు ఈ వాహనాలను ఎప్పుడూ సిద్ధంగా ఉంచుతారు. విద్యుత్ లైన్ల మరమ్మతులకు అవసరమైన కండక్టర్లు, ఇన్సులేటర్లు, కేబుల్స్, టూల్స్ వంటి నిత్యావసర మెటీరియల్‌ను ఈ వాహనాల్లో ముందుగానే లోడ్ చేసి ఉంచుతారు. సమస్య ఏర్పడిన వెంటనే విద్యుత్ శాఖ బృందాలు ఘటనా స్థలానికి చేరుకునేందుకు వీలుగా ఈ వాహనాలకు జీపీఆర్‌ఎస్ ట్రాకింగ్ సిస్టంను అమర్చారు. దీంతో ఎక్కడ విద్యుత్ సమస్యలు తలెత్తినా వేగంగా గుర్తించి పరిష్కరించే అవకాశం ఏర్పడింది.
రైతులు, వినియోగదారులకు ఊరట
ఈ ఎమర్జెన్సీ సేవల వల్ల జిల్లాలోని రైతులు, వాణిజ్య సముదాయాల నిర్వాహకులు, సాధారణ వినియోగదారులకు ఎంతో ఊరట కలగనుంది. ముఖ్యంగా వ్యవసాయ పంపుసెట్లకు అంతరాయం లేకుండా విద్యుత్ అందడం వల్ల రైతాంగానికి మేలు జరగనుంది. గృహ, వ్యాపార అవసరాలకు సైతం కోతలు లేని విద్యుత్‌ను అందించాలన్నదే ఈ విధానం ప్రధాన ఉద్దేశం.
తక్షణ పరిష్కారానికి..
విద్యుత్ సరఫరాలో హఠాత్తుగా ఏర్పడే లోపాలు, లైన్ బ్రేక్‌డౌన్లు, ట్రాన్స్‌ఫార్మర్ సమస్యలను వీటి సహాయంతో తక్షణం పరిష్కరించడానికి ఈ వ్యవస్థ ఎంతగానో ఉపకరిస్తుంది. వర్షాకాలం, ఈదురు గాలుల సమయంలో విద్యుత్ తీగలు తెగిపడితే వాటికి దూరంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఎక్కడైనా ప్రమాదకర స్థితిలో విద్యుత్ స్తంభాలు, తీగలు కనిపిస్తే వినియోగదారులు వెంటనే టోల్‌ప్రీ నంబర్ 1912కు ఫోన్ చేసి సమాచారం అందించాల్సి ఉంది. ఈ టోల్‌ప్రీ నంబర్ 24 గంటలపాటు అందుబాటులో ఉంటుంది.


