సూర్యాపేటటౌన్ : సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన సామాజిక కార్యకర్త, తెలుగు పండితుడు రాచకొండ ప్రభాకర్ బ్రాహ్మణుడి వేషధారణలో డ్రగ్స్‌కు వ్యతిరేకంగా సోమవారం పాత బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కల్పించారు. ‘పరాభవనామ సంవత్సరంలో ఏ రాశికి చెందిన వారైనా గంజాయి, డ్రగ్స్, మత్తు పదార్థాలకు బానిసలైతే అవమానం, వ్యయం ఎక్కువ, రాజ్యపూజ్యం తక్కువ ఉంటుంది’ అంటూ అవగాహన కల్పించారు. యువత, ప్రజలు మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటే సమాజంలో రాజ్యపూజ్యం, గౌరవ మర్యాదలు పెరుగుతాయని, ఆదాయం పెరుగుతుందని, వ్యయం తగ్గుతుందన్నారు. అలాగే రోడ్డు భద్రత నియమాలు పాటించకపోతే తీవ్ర ప్రమాదాలు జరిగి ప్రాణ నష్టం వాటిల్లి కుటుంబాలకు తీరని శోకం మిగులుతుందన్నారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ జీవితంలో ముందుకెళ్లాలని సూచించారు.


