రోడ్డు భద్రతకు ప్రాధాన్యమివ్వాలి
భానుపురి (సూర్యాపేట): రోడ్డు భద్రతకు అధికారులు అత్యంత ప్రాధాన్యమివ్వాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ సూచించారు. గురువారం సూర్యాపేట కలెక్టరేట్‌లో ఎస్పీ నరసింహతో కలిసి నిర్వహించిన జిల్లా స్థాయి రోడ్డు భద్రత కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జాతీయ, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్ రహదారులపై ప్రమాదాలు జరగకుండా భద్రతా ప్రమాణాలు పాటించాలన్నారు. ఎక్కువగా భద్రతా వైఫల్యం, రోడ్లు సరిగా లేకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ప్రమాదాలు ఎక్కువగా ఎక్కడ జరుగుతున్నాయో ఆర్‌అండ్‌బీ, పంచాయతీ రాజ్ అధికారులు గుర్తించి వారం రోజుల్లో మరమ్మతులు చేయించాలన్నారు. బ్లాక్ స్పాట్లను గుర్తించి రేడియం స్టిక్కర్లు, స్టడ్స్ లైట్స్, బారికేడ్లు ఏర్పాటు చేయాలన్నారు. నేషనల్ హైవేలపై ప్రమాదాలు జరిగే చోట, సర్వీస్ రోడ్ల వెంట సూచిక బోర్డులు, డిస్‌ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలని, 22చోట్ల ముందుజాగ్రత్తలు ఏర్పాటు చేయాలన్నారు. సమావేవంలో అదనపు కలెక్టర్ కె. సీతారామారావు, డీఎస్పీ ప్రసన్నకుమార్, జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారి మాధవి, డీపీఓ యాదగిరి, సూర్యాపేట మున్సిపల్ కమిషనర్ హనుమంత్ రెడ్డి, ట్రాన్స్‌పోర్ట్ అధికారులు, ఆర్ అండ్‌బీ అధికారులు, నేషనల్ హైవే అధికారి రత్న కుమార్ పాల్గొన్నారు.


